Reading Time: 2 minutes
Sajjala Ramakrishna Reddy Alleges Dsc Scam Demands Cbi Inquiry

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక అభ్యర్థి కోర్టును ఆశ్రయించిన తర్వాతే వ్యవహారం బయటకు వచ్చిందని, ప్రస్తుతం రోజుకో ఆధారం వెలుగులోకి వస్తోందని ఆయన అన్నారు. డీఎస్సీ అభ్యర్థులే ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. టెట్‌ అర్హత లేని వారికీ ఉద్యోగాలు ఇచ్చారంటూ సజ్జల ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో సంబంధం లేని కులాలను కూడా చేర్చారని, పోస్టుల ఆధారంగా రేట్లు నిర్ణయించి ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. ఖాళీగా ఉన్న పోస్టుకు అనుగుణంగా నకిలీ సర్టిఫికెట్లు సమకూర్చి ఉద్యోగాలు ఇచ్చారంటూ విమర్శించారు. అభ్యర్థులను ఏడుసార్లు తనిఖీ చేశామని చెబుతున్న అధికారులు.. ఆ వెరిఫికేషన్ నిజంగా అర్హతల కోసమే జరిగిందా, లేక ‘మనోడా? కాదా?’ అని తెలుసుకోవడానికా అని ప్రశ్నించారు.

ఇక, డీఎస్సీ నియామకాలపై నిష్పాక్షికమైన స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని సజ్జల డిమాండ్ చేశారు. పరీక్షలు, నియామకాల ప్రక్రియకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించిన వారు అదే మంత్రిత్వ శాఖలో కొనసాగకూడదని అన్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగాలు పొందిన వారు, వారిని ఎంపిక చేసిన అధికారులు, వెరిఫికేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ధర్నాపై 30 యాక్ట్‌ ఎందుకు?
తమ పార్టీ నిరసన కార్యక్రమం ప్రకటించిన తర్వాత 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పారని సజ్జల అన్నారు. అయితే శాప్ కార్యాలయంలో టీడీపీకి చెందినవారికి 30 యాక్ట్ ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. వైసీపీ నిరసన రోజునే టీడీపీ, యువగళం కార్యకర్తలు అక్కడికి ఎందుకు వచ్చారని నిలదీశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు కూడా అదే రోజు అక్కడికి రావడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. తమపై కేసులు పెట్టడం, వేధించడం జరుగుతోందని సజ్జల ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా యుద్ధానికి వెళ్లినట్లుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తాము సంయమనంతో వ్యవహరించామని, అయితే ముందురోజు నుంచే తమపై దాడికి ప్రణాళికలు జరిగాయని ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడి చేసి, తిరిగి తమపైనే ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు.

‘ప్రభుత్వమే సమాధానం చెప్పాలి’
డీఎస్సీ అంశాన్ని ఉద్యోగులకు, వైసీపీకి మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని సజ్జల విమర్శించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలే ఉన్నారనే భయంతోనే ముందస్తుగా ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. శాప్ కార్యాలయం వద్దకు వచ్చిన వారంతా నిజంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులేనా అనే అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. డీఎస్సీ-25 ఉపాధ్యాయులు అదే రోజు ఎందుకు అక్కడికి వచ్చారని, వారికి ముందురోజు నుంచే ఎవరు వసతి కల్పించారని సజ్జల ప్రశ్నించారు. తాము నాలుగు రోజుల ముందుగానే నిరసనను ప్రకటించామని, వారు కూడా రావాలనుకుంటే మరో రోజు రావాలని చెప్పవచ్చని అన్నారు. అయితే తాము నిరసన చేసే రోజునే వారిని ఎందుకు పిలిపించారని ప్రశ్నించారు. యువగళం కార్యకర్తలు అక్కడికి ఎందుకు వచ్చారో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

‘తప్పు జరగకపోతే విచారణకు భయమెందుకు?’
డీఎస్సీలో ఎలాంటి తప్పు జరగలేదని చంద్రబాబు భావిస్తే విచారణకు ఆదేశించాలని సజ్జల అన్నారు. ఆరోపణల్లో వాస్తవం లేకపోతే విచారణ అనంతరం ఆయన కుమారుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఉద్యోగాలను తొలగించిన ఉదాహరణ ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లను ప్రజలు ప్రశ్నించాలని సజ్జల అన్నారు. తాము చేస్తున్న ఆరోపణలు తప్పని ప్రభుత్వం నిరూపిస్తే తామే ప్రజల ముందు నవ్వులపాలవుతామని వ్యాఖ్యానించారు. సమాధానాలు చెప్పాల్సింది ప్రభుత్వమే తప్ప తాము కాదని స్పష్టం చేశారు.

‘మండలిలో ఎందుకు సమాధానం చెప్పలేదు?’
డీఎస్సీ అంశంపై శాసనమండలిలో చర్చించాలని తాము కోరామని, అయితే మంత్రి లోకేశ్ ఎందుకు సమాధానం చెప్పలేదని సజ్జల ప్రశ్నించారు. తాము ఉన్న చోటుకు వచ్చి చర్చించకుండా బయటకు వచ్చి సవాళ్లు విసరడం ఏమిటని అన్నారు. ఇప్పటికైనా అధికారులను పంపడం కాకుండా తమ ప్రశ్నలకు ప్రభుత్వం నేరుగా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. దబాయింపులతో సమస్యను ఎంతకాలం కొనసాగిస్తారని ప్రశ్నించారు. తండ్రీకొడుకులు కలిసి ఫస్ట్ అటెంప్ట్ డీఎస్సీపైనే కుట్ర చేశారని, మిగతా ఉద్యోగాలను కూడా అమ్ముకునే ప్రయత్నం చేశారని సజ్జల తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఇవి రాజకీయ ఆరోపణలేనని, వీటిపై సంబంధిత వర్గాల సమాధానాలు, అధికారిక విచారణ ఫలితాలు వెలువడాల్సి ఉందని పేర్కొనాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా, అధికారులు అభ్యర్థుల అర్హతలు, సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం పరిశీలిస్తున్నామని, నకిలీ సర్టిఫికెట్ లేదా అర్హతల ఉల్లంఘన తేలితే చర్యలు తీసుకుంటామని ఇప్పటికే వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి..