
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ఎన్నో స్పూఫ్ కామెడీలు చూశాం. కానీ తనలోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసే క్రేజీ అవకాశం ఆయన తలుపు తట్టింది. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’లో సంపూ ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఒక నటుడికి కొన్ని పాత్రలు పేరు తెస్తాయి, మరికొన్ని అవార్డులు తెచ్చిపెడతాయి. కానీ చాలా అరుదుగా కొన్ని పాత్రలు వస్తాయి.. మనం ఏంటో మనకే తెలియకుండా సినిమా మనల్ని ప్రపంచం ముందు నిలబెడుతుంది. దర్శకుడు శ్రీకాంత్ అన్న నాకోసం కేవలం ఒక క్యారెక్టర్ రాయలేదు.. చాలా రోజులుగా మౌనంగా మూగబోయిన నా గొంతుకు ఒక రూపాన్ని ఇచ్చాడు. అదే సినిమాలో మీరు చూడబోతున్న ‘బిర్యానీ’ పాత్ర” అంటూ సంపూ చెప్పిన మాటలు ఆడియన్స్‌ను కదిలించాయి. తన చిన్న సినీ కెరీర్‌లో అత్యధిక రోజులు డేట్స్ కేటాయించి చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదేనని ఆయన స్పష్టం చేశారు.
నానితో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై సంపూ ప్రత్యేకంగా స్పందించారు. “నాని అన్న పక్కన నటించే క్రమంలో ఆయన అంకితభావాన్ని చూసి ఇంకా ఎంతో నేర్చుకోవాలని అర్థమైంది. నన్ను నమ్మి ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం చేసిన దర్శకుడు శ్రీకాంత్‌కు రుణపడి ఉంటాను. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్, అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరూ శ్రీకాంత్ అన్నలాగే మొండోళ్లు. భవిష్యత్తులో ఈ టీమ్ నుంచి మరికొందరు శ్రీకాంత్‌లు పుట్టుకొస్తారు” అని సంపూ కొనియాడారు. తమ కష్టానికి ప్రేక్షకులు ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతూ.. “నాలాంటి ఒక సాధారణ నటుడిని మొదటి నుంచి ఆదరించారు. నాలో ఎంతో కాలంగా ఆకలి ఉంది.. ఆ నటన తాలూకు అసలైన ఆకలి సెప్టెంబర్ 24న తీరబోతోంది” అంటూ ఎమోషనల్‌గా తన స్పీచ్‌ను ముగించారు. అనంతరం వేదికపై ‘ఏషనాగుల’ పాటకు తనదైన శైలిలో వేసిన స్టెప్పులతో ఈవెంట్‌లో జోష్ నింపారు.