Reading Time: < 1 minute

ములుగు జిల్లాలో ఘోర విషాదం: సరదాగా పొలానికి వెళ్లి నీటికుంటలో పడి అక్కాచెల్లెళ్లు మృతి

Caption of Image.

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ములుగు మండలం కాశీందేవిపేట గ్రామంలో నీటికుంటలో పడి అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. సెలవు రోజు కావడంతో సరదాగా తండ్రి వెంట పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు కుమార్తెలు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

వివరాల ప్రకారం.. కాశీందేవిపేట గ్రామానికి చెందిన ఎండీ అంజద్ పాషా ఆదివారం సెలవు రోజు కావడంతో తన ఇద్దరు కుమార్తెలను వెంట తీసుకుని పొలం వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో చిన్న కుమార్తె ఆసియా (9) నీటికుంట నుంచి నీళ్లు తీస్తుండగా ప్రమాదవశాత్తూ జారి కుంటలో పడిపోయింది. ఆమె మునిగిపోతుండడాన్ని గమనించిన పెద్ద కుమార్తె సమిత్ (18) చెల్లిని కాపాడేందుకు కుంటలోకి దిగింది. 

అయితే ఆమె కూడా అదుపు తప్పి నీటిలో మునిగిపోయింది. స్థానికులు ఇద్దరినీ బయటకు తీసేలోపే వారు మృతి చెందారు. ఒకేసారి ఇద్దరు కుమార్తెలను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి ఇద్దరి మృతితో కాశీందేవిపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

 

©️ VIL Media Pvt Ltd.