Reading Time: 5 minutes
Story Board About Telugu States Face Drought As Groundwater Levels Fall Water Crisis Deepens

Story Board: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో 15 శాతం తక్కువ వర్షపాతంనమోదు కాగా, ఎల్‌ నినో కూడా ఏర్పడటంతో తీవ్ర వర్షాభావ, కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా దక్షిణ ద్వీపకల్పం తీవ్రంగా ప్రభావితమై 28 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యంత కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దేశంలోని పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సాగునీటికే కాక, తాగు నీటికి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి.

బలమైన ఎల్‌ నినో ప్రభావం కారణంగా ఈ సీజన్‌ మొత్తంలో దేశవ్యాప్తంగా 15 శాతం టులో వర్షపాతం నమోదైంది. ఇక దక్షిణాది రాష్ర్టాలను చూస్తే అత్యధికంగా ఏపీలో 43 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో కూడా 22 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఎల్‌నినో ప్రభావం రోజు రోజుకు ఎక్కువుతోంది. అల్పపీడనంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నా.. ఏపీలోని అత్యధిక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి. పల్నాడు, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే వేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. పత్తి, కంది, మినుము, ఆముదం, వేరుశనగ తదితర పంటలు ఎండుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా 26.50 లక్షల హెక్టార్లలో పంటలు వేయగా.. అందులో 2.44 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని పంటలపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో సుమారు 41,474 హెక్టార్లలో వేసిన పైర్లు ఎండు దశకు చేరాయి. 10,582 హెక్టార్లలో పంటలు ఎండిపోయాయి. మరో 1,92,387 హెక్టార్లలోని పంటలు తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 284 మండలాలు, 1,792 రైతు సేవా కేంద్రాల పరిధిలోని పంటలపై ఎల్‌నినో తీవ్రత అధికంగా ఉంది.

ప్రతి ఏడాది సెప్టెంబర్ లో భారీ వర్షాలు,వరదలు, తుఫాన్లు వచ్చేవి. ఎటు చూసినా ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉండేవి. కానీ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాకాలం కూడా మరో వేసవిని తలపిస్తోంది. ఎండలకుతోడు వేడి గాలులుతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.పంట పొలాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అధిక మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. కర్నూలు జిల్లాలో 1.10 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 80,751 హెక్టార్లు, అనంతపురం జిల్లాలో 32,456 హెక్టార్లలో సాగవుతున్న పైర్లపై ప్రభావం ఎక్కువగా ఉంది. 74,301 హెక్టార్లలో కంది, 73,733 హెక్టార్లలో పత్తి, 25వేల హెక్టార్ల మొక్కజొన్న, 18వేల హెక్టార్ల వరి నీరందక ఎండుతోంది. బత్తాయి, మామిడి, ఇతర ఉద్యాన పంటలూ ఎండుదశకు చేరుతున్నాయి. ఒక్కో తోటలో పదుల సంఖ్యలో చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో కరవు పరిస్థితులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ప్రధాన జలాశయాలు పూర్తిగా అడుగంటాయి. భూగర్భ జలమట్టాలు పడిపోయి పల్లెలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతోంది. కల్యాణి డ్యాంలో నీరు మరో నెలకు మాత్రమే సరిపోయే పరిస్థితి ఉండటంతో తిరుపతి, తిరుమలలో సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. రాబోయే రోజుల్లో వర్షాలు కురవక, వరద ప్రవాహం రాకపోతే అందుబాటులో ఉన్న నీరు మరో నెల రోజులకు మాత్రమే సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జలాశయం పరిసరాల్లో నీరు తగ్గిపోయి రాళ్లు, రప్పలు తేలి కనిపిస్తున్నాయి. వానాకాలం చివరి రోజుల్లో అయినా వర్షాలు పడకపోతే ఆధ్యాత్మిక క్షేత్రాలైన తిరుపతి, తిరుమలలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదం పొంచి ఉంది. ఎల్ నినో నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చెరువులు ఎండిపోయి సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు..మెట్ట ప్రాంతంలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారు.. సోమశిల కండలేరు జలాశయాలలో ఎప్పుడూ లేని విధంగా కనిష్ట స్థాయికి నీటి నిల్వలు దిగజారాయి.సాగుకు సిద్ధం కావాల్సిన రైతులు దిక్కుతోచని స్థితిలోఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొన్నిచోట్ల బత్తాయి తో పాటు వాణిజ్య పంటలు నీరు లేక ఎండిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి.అప్పుడప్పుడు కరుస్తున్న వానలు పెద్దగా ఆదుకోలేకపోతున్నాయి.

కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు 60 శాతం లోటు వర్షపాతం వుంది.దీంతో పంటలు వేసిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు.రిజర్వాయర్లు కాలువలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నీటి ఎద్దడి అంతకంతకు ఎక్కువవుతుంది.కొన్నిచోట్ల పంటలు సాగు చేయలేక వదిలేసారు.ఒకవైపు పంటలు ఎండిపోతుంటే మరోవైపు కనీసం పశువులకు మేత కూడా దొరకడం లేదు. ఎల్‌నినో గుంటూరు జిల్లాలో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఓ వైపు వర్షాలు లేక… మరోవైపు భూగర్బజలాలు తగ్గిపోవడంతో రైతులు పంటలు సాగు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు… వర్షాలపై ఆశతో పంటలు సాగు చేసిన రైతులు కళ్లముందే అవి ఎండిపోతుండడంతో ఆవేదన చెందుతున్నారు. పల్నాడు జిల్లాలో 50వేల ఎకరాల్లో వరిసాగు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది సాగునీరు విడుదల కాకపోవడంతో 70శాతం వరి సాగు విస్తీర్ణం తగ్గింది. బోర్ల కింద సాగు చేసిన పత్తి,మిర్చి పంటల్ని అన్నదాతలు కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది.

పల్నాడు జిల్లాలో గతేడాది 60వేల ఎకరాల్లో మిర్చిసాగు చేస్తే ఈ ఏడాది ఎల్ నినో ఎఫెక్ట్ తో 20వేల ఎకరాల్లో మిర్చిసాగు మొదలుపెట్టారు రైతులు. ఎకరాకు 50నుంచి 60వేల వరకూ రైతులు ఇప్పటికే ఖర్చుచేశారు. కానీ వర్షాలు కురవకపోవడంతో మిర్చిపంట ఎండిపోవడం మొదలైంది. దీంతో పంటను కాపాడుకునేందుకు మిర్చిరైతులు నీళ్లకోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు తప్పడం లేదు.నీళ్లుకోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తోంది.విశాఖలో తాగునీటికోసం తీవ్రకష్టాలు పడుతున్నారు మహిళలు.ఖాళీ బిందెలు పట్టుకుని నీళ్లకోసం పోరాడాల్సిన దుస్థితి. ఇక్కడే కాదు చాలాచోట్ల తాగునీటి కష్టాల ఎదురువుతున్నాయి. పరిస్థితి మరింత విషమించకముందే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లను ముమ్మరం చేయాలని జనం కోరుతున్నారు. బోర్లు పునరుద్ధరించడం, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మొత్తానికి ఎల్ నినో ఏపీలో పలు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాలు కురవకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. సాగు కోసం చేసిన అప్పులు కళ్ల ముందు కదలాడుతుంటే అన్నదాతలు ఆక్రందనలు మిన్నంటుతున్నాయి.ఉన్న పంటలైనా ఎలా కాపాడుకోవాలన్న ఆందోళన వాళ్లకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అయితే సాగునీటిపై ముందే ఆశలు వదులుకున్న సర్కారు.. తాగునీటికి కొరత రాకుండా ప్రణాళికలు రూపొందించినా.. అడుగంటుతున్న భూగర్భజలాలు.. ఆ ప్లాన్లకు కూడా సవాల్ విసురుతున్నాయి. దీంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కౌంటర్ యాక్షన్ ప్లాన్ కోసం ముందడుగు వేస్తోంది. తాగునీటి కొరత తీవ్రమైతే.. ప్రజలు ప్యానిక్ అవుతారని, ఆ పరిస్థితి రాకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కొన్నేళ్లుగా సమృద్ధిగా వర్షాలు పడి.. నీటి కొరత ఏంటో చూడని జనం.. ఇప్పుడు సాగునీటికే కాకుండా తాగునీటికీ కటకట ఏర్పడటాన్ని చూసి భయపడుతున్నారు. సాధారణంగా రిజర్వాయర్లలో నీళ్లు లేకపోతే.. వానలు కురవకపోతే.. భూగర్భజలాల్ని నమ్ముకుంటారు. కానీ ఈసారి బోర్లు వేసినా కూడా భూగర్భజలాలు అడుగంటిపోవడం.. తీవ్ర కరవు ఛాయలకు అద్దం పడుతోంది. మామూలుగా అయితే ఓ రాష్ట్రంలో నీటి కొరత ఉంటే.. మరో రాష్ట్రం నుంచైనా నీళ్లు తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా నీటికొరత ఉండటంతో.. ఎవర్నీ అడగలేని, అడిగినా వారూ ఇవ్వలేని దుస్థితి నెలకొంది. దీంతో ఇటు ఏపీ, అటు తెలంగాణ కూడా ఉన్న నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు సూచిస్తున్నాయి.

తెలంగాణలో ఏపీతో పోలిస్తే వానలు పర్వాలేదనిపించినా.. కురవాల్సినంత వర్షాలైతే పడలేదనే చెప్పాలి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు భూగర్భజలం కూడా అడుగంటడంతో.. తాగునీటికీ కొరత వచ్చి పడే సూచనలు కనిపిస్తున్నాయి. అంతకుమించి ప్రాజెక్టుల్లో తాగునీటి కోసం ఉంచిన నీటి నిల్వల్ని కూడా సాగు కోసం విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో మిషన్ భగీరథ పథకం కింద గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే 123 శుద్ధి కేంద్రాలకు రాష్ట్రంలోని 29 ప్రధాన జలాశయాలు ఆధారంగా ఉన్నాయి. ఈ 29 జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 1,059 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం కేవలం 333.44 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. గతేడాది ఇదే సమయంలో 522.31 టీఎంసీల నిల్వలు ఉండగా.. గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత దిగజారింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీకి పైన వినియోగించదగిన నీరు కేవలం 3 టీఎంసీలే మిగిలి ఉండగా.. ప్రతి నెల తాగునీటి అవసరాలకు సుమారు అర టీఎంసీ అవసరం అవుతోంది. లోయర్ మానేరు, ఎల్లంపల్లి, కడెం, జూరాల, నాగార్జునసాగర్, నిజాంసాగర్, సింగూర్, కోయిల్‌సాగర్, రామన్‌పాడు, అక్కంపల్లి, వైరా, ఉదయసముద్రం, ధర్మసాగర్ వంటి జలాశయాల్లోనూ నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఈ జలాశయాలపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలతో మంజీరా, సింగూర్, గోదావరి వ్యవస్థల నుంచి ఈ నెలాఖరు వరకు మాత్రమే తాగునీరు అందించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ అవసరాల కోసం సింగూర్‌లో కనీసం 16 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖకు సూచనలు వెళ్లాయి.

ఇదిలా ఉండగా భూగర్భ జలాల పరిస్థితి కూడా దిగజారుతోంది. జూన్ నాటికి రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 9.46 మీటర్ల లోతుకు పడిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బోర్లను మరింత లోతుగా తవ్వడం, అవసరమైన చోట కొత్త బోర్లు ఏర్పాటు చేయడం, వర్షపు నీటి సంరక్షణ చర్యలను వేగవంతం చేయడం వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేపడుతోంది. అయితే భారీ వర్షాలు త్వరలో కురవకపోతే.. కృష్ణా-గోదావరి జలాశయాల్లో నిల్వలు పెరగకపోతే తెలంగాణలో రానున్న నెలల్లో తాగునీటి సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో కరువు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు కూడా క్రమంగా పడిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతుండగా.. సాగునీటి సమస్య మరింత తీవ్రమవుతోంది. తాగునీటి సమస్య కూడా రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, భూగర్భ జలాల కొరత కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. పాలమూరు, ఖమ్మం, నల్లగొండ సహా పలు జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పాలమూరు జిల్లాలో జూన్‌, జూలై నెలల్లో కంటే సాగుకు కీలకమైన ఈ నెలలో ఏకంగా 80 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా దాదాపు 4.58 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. ఆ ప్రాంతం..ఈ ప్రాంతమని కాదు..ఎక్కడ చూసినా వర్షాభావమే.ఎల్‌నినో ధాటికి రైతులు విలవిలలాడుతున్నారు. వానలు పడక, భూగర్భ జలాలూ లేక పంటలు ఎండిపోతుంటే తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు. సాగు చేసిన పంటలను రక్షించుకుందామంటే ప్రాజెక్టుల కింద నీరు విడుదల కావటం లేదు. వరిసాగు చేయొద్దని అధికారులు హెచ్చరించినప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్లలో నీరు వస్తుందని భావించిన రైతులు పంటలు వేసుకోగా ఇప్పుడవి ఎండిపోతున్నాయి. ఆరుతడి పంటల పరిస్థితి కూడా అలాగే ఉంది.చాలా జిల్లాల్లో 40 శాతం పంటలు ఎండిపోయాయి. మిగతా పంటల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయే అవకాశం వుంది. పంటలు ఎండిపోవడంతో పలుచోట్ల వరి పొలాలను పశువుల మేతకు వదిలేస్తుండటం కలిచివేస్తోంది.వరుణుడు కరుణించకపోడా..వాన రాకపోదా అన్న చిన్న ఆశ కూడా లేకుండా పోతోంది.