
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా అమెరికా తన ఊబిని తానే సృష్టించుకుందని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ మొహషెన్ రెజాయ్ అన్నారు. ఈ ఊబి నుంచి అమెరికా బయటపడాలని అనుకుంటే తాము పంపిన 7 షరతులను అంగీకరించాలని స్పష్టం చేశారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికాకు తాము ఈ కండీషన్లు పంపామని, వాటిపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిస్పందన కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.
తమ షరతులకు ఒప్పుకోవడం తప్ప అమెరికాకు మరో మార్గం లేదని శనివారం అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజాయ్ ఈ మేరకు కామెంట్ చేశారు. ఆదివారం ఉదయం కూడా ఆయన ఈ విషయంపై ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అమెరికా ఈ ఊబిలో మరింతగా చిక్కుకోకూడదని భావిస్తే.. ఇరాన్ హక్కులను షరతులను అంగీకరించక తప్పదన్నారు.
అన్ని రకాలుగా యుద్ధాన్ని ముగించడం, విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్‌పై నేవీ దిగ్బంధనాన్ని తొలగించడం వంటి కండీషన్లను తాము పంపామని రెజాయ్ తెలిపారు. యెమెన్, సౌదీ అరేబియా సంబంధిత పోరాటాలు కూడా ముగించాలని ఇరాన్ కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ‘‘షరతులను అంగీకరించడం అమెరికా ప్రయోజనాలకే మంచిది.
ట్రంప్ బెదిరింపుల వల్ల ఎలాంటి ఫలితాలు రావు. మేం నిర్ణయాత్మక యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం” అని ఆయన స్పష్టం చేశారు. తమ దేశ సైనిక అంచనాల ఆధారంగా ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడికి దిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. అయితే, ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి తాము కొత్త వ్యూహంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.