Reading Time: 2 minutes

యుద్ధ చరిత్రలోనే బిగ్గెస్ట్ అటాక్.. రష్యాపై 1000  డ్రోన్లతో ఉక్రెయిన్ భీకర దాడి

Caption of Image.

కీవ్: దాదాపు ఐదేండ్ల రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనే బిగ్గెస్ట్ అటాక్ జరిగింది. రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడికి పాల్పడింది. రష్యా రాజధాని మాస్కోతో పాటు పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి దాదాపు 1000కి పైగా డ్రోన్లతో ఉక్రెయిన్ సైన్యం విరుచుకుపడింది. ఈ దాడిలో మాస్కో ఆయిల్ రిఫైనరీ (చమురు శుద్ధి కర్మాగారం)తో పాటు ఒక నివాస భవనాన్ని కూడా డ్రోన్లు తాకాయి. మాస్కో ఆయిల్ రిఫైనరీకి భారీగా నష్టం వాటిల్లింది. 

ఈ భారీ దాడి కారణంగా మాస్కో పరిసర ప్రాంతాల్లో ఒక 44 ఏళ్ల మహిళ, 74 ఏళ్ల వృద్ధుడు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి దేశంలోని పలు ఎయిర్ పోర్టులను మూసివేసింది. విమాన రాకపోకలను నిలిపివేసింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మాస్కోపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని రష్యా అధికారులు ధృవీకరించారు. 

దేశవ్యాప్తంగా మొత్తం 1100 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాజధాని మాస్కో వైపు దూసుకొచ్చిన 450 డ్రోన్లను మార్గమధ్యంలోనే అడ్డుకున్నట్లు తెలిపింది. మాస్కోపై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ పేర్కొన్నారు. ఈ దాడి వల్ల మాస్కో ఆయిల్ రిఫైనరీ, ఒక నివాస భవనం దెబ్బతిన్నట్లు ఆయన ధృవీకరించారు. రష్యా పార్లమెంట్ ఎన్నికలకు అంతరాయం కలిగించే ప్రయత్నమే ఈ డ్రోన్ దాడి అని ఆయన ఆరోపించారు. అయితే, శత్రువు తన ప్రణాళిక అమలు చేయడంలో విఫలమయ్యాడని చెప్పారు. 

ఎన్నికల వేళ ఉక్రెయిన్ వ్యూహాత్మక దాడి

రష్యాలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత మాస్కో స్వాధీనం చేసుకున్న నాలుగు ఉక్రేనియన్ ప్రాంతాలలో కూడా రష్యా ఓటింగ్ నిర్వహించింది. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న నల్ల సముద్ర ద్వీపకల్పమైన క్రిమియాలో కూడా ఓటింగ్ జరిగింది. ఆక్రమిత భూభాగాల్లో జరిగిన ఎన్నికలను ఉక్రెయిన్ చట్టవిరుద్ధమని ఖండించింది. 

ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల చివరి రోజున అర్ధరాత్రి రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులకు పాల్పడింది. దాదాపు 1000కి పైగా డ్రోన్లతో మెరుపు దాడులు చేసింది. పార్లమెంట్ ఎన్నికలకు ఆటంకం కలిగించడమే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. రష్యా యుద్ధ యంత్రాంగాన్ని నడిపించే ఆర్థిక మూలాలపై తాము దెబ్బకొట్టామని ఉక్రెయిన్ దళాలను ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ ప్రశంసించారు. 

©️ VIL Media Pvt Ltd.