
వాషింగ్టన్: అమెరికా మిత్ర దేశం సౌదీ అరేబియాకు ట్రంప్ షాకిచ్చారు. హౌతీలపై అమెరికా దాడి చేయాలన్న సౌదీ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. గల్ఫ్‌లోని అమెరికా దళాలు, సైనిక స్థావరాలు, చమురు నౌకలపై దాడులు చేయబోమని హౌతీలు అమెరికా మాట ఇచ్చారని తెలిపారు. దీంతో హౌతీలపై అమెరికా నేరుగా దాడులు చేయదని పేర్కొన్నారు. ఇప్పటికే హౌతీల దాడులతో సతమతమవుతున్న సౌదీకి ట్రంప్ ప్రకటన పుండు మీద కారం చల్లినట్లైంది.
సౌదీ అరేబియా, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ప్రాంతీయ ఆధిక్యత, మతపరమైన విభేదాలు, అంతర్గత రాజకీయాల కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరుగుతాయనే విషయం తెలిసిందే. ఇటీవల సౌదీ, హౌతీల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. సౌదీలోని ముస్లింల పవిత్ర స్థలంపై మక్కాపై హౌతీలు దాడులకు ప్రయత్నించింది. హౌతీల దాడులకు సౌదీ బలగాల ధీటుగా కౌంటర్ ఇచ్చాయి. ఈ క్రమంలో హౌతీలపై దాడి విషయంలో సౌదీ తమ మిత్ర దేశం అమెరికా సాయం కోరింది.
హౌతీలపై ప్రత్యక్ష సైనిక చర్యకు దిగాలని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికాను కోరారు. కానీ సౌదీ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. ప్రస్తుతానికి హౌతీలపై నేరుగా దాడులు చేయడానికి ట్రంప్ అంగీకరించలేదు. హౌతీలు అమెరికా దళాలు, సైనిక స్థావరాలు, చమురు నౌకలపై దాడులు చేయబోమని హామీ ఇచ్చారని తెలిపారు. ఇటీవల ఒమన్‌లో అమెరికా అధికారులు, హౌతీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో కూడా ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని హౌతీలు హామీ ఇచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి.