
ఇడ్లీ, దోసలకు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఈ రుచికరమైన ఆలూ-రవ్వ స్నాక్ ను సులభంగా తయారు చేసుకోండి. గోధుమ పిండి, బొంబాయి రవ్వ, ఉడికించిన ఆలుగడ్డలతో చేసే ఈ వంటకం సాయంత్రం పూట అల్పాహారానికి ఎంతో బాగుంటుంది. దీనిని చేయడం చాలా సులువు, దీని తయారీకి ఎక్కువ సమయం కూడా పట్టదు.
కావలసిన పదార్ధాలు..
- ఉప్మా రవ్వ: అర కప్పు
- గోధుమపిండి: రెండు కప్పులు
- ఉప్పు: రుచికి సరిపడా
- నువ్వులు: ఒక స్పూన్
- రెడ్ చిల్లీ ఫ్లేక్స్: ఒక స్పూన్
- కొత్తిమీర: కొద్దిగా (తరిగినది)
- నూనె: వేయించడానికి సరిపడా, పిండి కలపడానికి
- నీళ్లు: పిండి కలపడానికి
ఆలూ మిశ్రమం కోసం..
- ఆలుగడ్డలు: ముందే ఉడికించి తురిమినవి
- పచ్చిమిర్చి: ఒకటి (సన్నగా తరిగినది)
- ఉల్లిపాయ: ఒకటి (సన్నగా తరిగినది)
- కొత్తిమీర: కొద్దిగా (తరిగినది)
- అల్లం పేస్ట్: ఒక టీ స్పూన్
- గరం మసాలా: ఒక టీ స్పూన్
- ధనియాల పొడి: ఒక టీ స్పూన్
తయారీ విధానం..
ముందుగా, అర కప్పు ఉప్మా రవ్వను మిక్సీ జార్ లో వేసి ఒకసారి తిప్పండి. రవ్వ లావుగా ఉంటే కొంచెం మెత్తగా మారుతుంది, ఇది పిండికి చక్కని ఆకృతిని ఇస్తుంది. ఈ మిక్సీ పట్టిన రవ్వను పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో రెండు కప్పుల గోధుమపిండి, మిక్సీ పట్టిన రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మరియు కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం నుంచి రెండు స్పూన్ల పొడి పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసి పక్కన పెట్టండి. దీనిని తర్వాత పలుచని పిండి మిశ్రమం కోసం ఉపయోగిస్తాము. మిగిలిన పిండిలో కొంచెం నూనె వేసి, మరొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా కాకుండా, వీడియోలో చూపిన విధంగా సాఫ్ట్ గా ఉండాలి. పిండిని కలిపిన తర్వాత, దానిపై మూత పెట్టి పది నిమిషాలు పక్కన నానబెట్టాలి.
ఈలోగా, ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలను సన్నగా తురుముకోవాలి. తురమడం కుదరకపోతే మెత్తగా ఎనిపినా సరిపోతుంది, ముక్కలు ముక్కలుగా లేకుండా చూసుకోండి. తురిమిన ఆలుగడ్డలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పక్కన తీసి పెట్టుకున్న పొడి పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచగా, జారుడుగా ఉండే మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇది మనం చేసే స్నాక్ ముక్కలకు బయటి పొరగా ఉపయోగపడుతుంది. నానబెట్టిన గోధుమ పిండిని ఇంకొక్కసారి మంచిగా కలుపుకొని, పెద్ద సైజు చపాతీ అయ్యేలా ముద్దలుగా తయారు చేసుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకుని, పొడి పిండి చల్లుకుంటూ పెద్ద చపాతీలా మరీ పల్చగా లేదా మందంగా కాకుండా ఒత్తుకోవాలి.
ఒత్తుకున్న చపాతీ పైన తయారు చేసి పెట్టుకున్న ఆలూ మిశ్రమాన్ని సమానంగా పరచాలి. ఆలూ మిశ్రమం చపాతీ అంతా పూసిన తర్వాత, వీడియోలో చూపిన విధంగా జాగ్రత్తగా ఫోల్డ్ చేసి, తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని చపాతీలను ఇలాగే తయారు చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఒక్కొక్క ముక్కను తీసుకుని, చేతివేళ్లతో కొద్దిగా నొక్కాలి. ఇలా చేయడం వల్ల లోపల ఆలూ మిశ్రమం బయటికి రాకుండా ఉంటుంది. మీడియం హీట్ లో వేడి చేయండి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పలుచని పిండి మిశ్రమంలో ఒక్కొక్క కట్ చేసిన ముక్కను ముంచి, వేడి నూనెలో వేయాలి. గ్యాస్ ను హై ఫ్లేమ్ లో పెట్టి, బంగారు రంగు వచ్చేవరకు చక్కగా వేయించుకోవాలి. బంగారు రంగులోకి మారి క్రిస్పీగా మారిన తర్వాత నూనె నుంచి తీసి పక్కన పెట్టుకోండి. రెండో వాయిని కూడా ఇదే పద్ధతిలో వేయించుకోవాలి. ఈ టేస్టీ, క్రిస్పీ ఆలూ-రవ్వ స్నాక్ సాయంత్రం అల్పాహారానికి సరైన ఎంపిక. వేడి వేడిగా సర్వ్ చేస్తే భలే రుచిగా ఉంటుంది.