
హైదరాబాద్ రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్‌కు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల ప్రభుత్వమని, పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా కోట్లకు పైగా విలువ చేసే ఇళ్లను ఉచితంగా అందజేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఎకరం భూమి 250 కోట్ల రూపాయలు పలుకుతున్న తరుణంలో, పేదలకు ఇస్తున్న స్థలమే కోటి రూపాయలకు పైగా విలువ చేస్తుందని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో ఎలాంటి పైరవీలు నడవవని, పూర్తిగా లాటరీ పద్ధతిలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని తేల్చిచెప్పారు. మొదటి విడతలో లక్ష ఇండ్లు నిర్మించి చూపిస్తామని, దసరా నాటికి 2 లక్షల ఇండ్లు పూర్తి చేస్తామని, రాబోయే రెండున్నరేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందిస్తామని హామీనిచ్చారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ కు తాను గతంలోనే సవాల్ విసిరానని, ఇప్పటికీ ఆయన దాన్ని స్వీకరించలేదని ఎద్దేవా చేశారు. పేదలను రెచ్చగొట్టడమే కేటీఆర్, హరీశ్‌రావుల పనని విమర్శించారు. బీఆర్ఎస్ తీరు మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి సీట్లు సున్నా వస్తాయని జోస్యం చెప్పారు. కులం, మతం, పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఇల్లు రాని పేదలు ఎవరూ నిరుత్సాహపడొద్దని, రాబోయే విడతల్లో వారందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.