Reading Time: 2 minutes
Tarique Rahman Third Zia Family Member To Address Un General Assembly

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ త్వరలో అరుదైన రికార్డ్ సృష్టించబోతున్నారు. ఈ వారం అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించనున్నారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన మూడో తరం నేతగా రికార్డ్ సృష్టించబోతున్నారు. 1980లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తండ్రి జియావుర్ రెహమాన్ ప్రసంగించగా… అనంతరం ఆయన తల్లి ఖలేదా జియా 1993లో అదే వేదికపై ప్రసంగించారు. ఇప్పుడు తారిఖ్ రెహమాన్ వంతు వచ్చింది. ఈనెల 24న యూఎన్ వేదికపై ప్రసంగిస్తే అరుదైన ఘనత సాధించబోతున్నారు.

5

తారిక్ రెహమాన్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం న్యూయార్క్‌కు బయలుదేరి వెళ్లారు. సతీమణి డాక్టర్ జుబైదా రెహమాన్, ఇతరులు ఐదు రోజుల పర్యటన నిమిత్తం టర్కీ విమానంలో న్యూయార్క్‌కు బయలుదేరారని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఇస్తాంబుల్‌లో మూడు గంటల పాటు ఆగిన తర్వాత ప్రధాని రెహమాన్ న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయానికి సాయంత్రం 5:55 గంటలకు చేరుకుంటారని ప్రధాన మంత్రి ప్రెస్ సెక్రటరీ సలేహ్ షిబ్లీ తెలిపారు. సెప్టెంబర్ 24న జరిగే 81వ సమావేశంలో ప్రధానిగా తొలి ప్రసంగం చేయనున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన తన కుటుంబంలోని మూడవ వ్యక్తిగా రెహమాన్ చరిత్ర సృష్టించనున్నారు. గతంలో మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, మాజీ ప్రధాన మంత్రి ఖలేదా జియా తర్వాత తారిఖ్ రెహమాన్‌కు ఆ అవకాశం దక్కుతోంది.

సెప్టెంబర్ 22న దేశాధినేతలు, ప్రభుత్వ అధినేతల కోసం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఏర్పాటు చేసిన స్వాగత అల్పాహార విందుకు రెహమాన్ హాజరై.. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇతర ప్రపంచ నాయకులతో కలవనున్నారు. సాయంత్రం.. దేశాధినేతలు, ప్రభుత్వ అధినేతల గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటు చేసిన విందుకు రెహమాన్ హాజరవుతారు. మరుసటి రోజు అల్పాహార సమావేశంలో అంతర్జాతీయ స్వచ్ఛంద మరియు మానవతా సంస్థల ప్రతినిధులతో అభిప్రాయాలను పంచుకుంటారు.

అదే రోజు బ్రెజిల్, దక్షిణాఫ్రికా, నార్వే, స్పెయిన్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ అసమానతల సంక్షోభాన్ని పరిష్కరించే సమావేశంలో ప్రసంగిస్తారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ చొరవతో ఏర్పాటు చేసిన ‘వాతావరణ చర్య, న్యాయమైన పరివర్తన’పై ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. సెప్టెంబర్ 24న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్నారు. అదే రోజు సముద్ర మట్టం పెరుగుదల వల్ల ఎదురయ్యే తీవ్ర ముప్పులపై జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేయనున్నారు.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా రెహమాన్.. పాకిస్థాన్, భూటాన్, థాయ్‌లాండ్, క్రొయేషియా, హైతీ దేశాల అధినేతలతో.. కువైట్ యువరాజుతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారని ప్రభుత్వ వార్తా సంస్థ బీఎస్ఎస్ నివేదించింది.