Reading Time: < 1 minute

కుల వేధింపుల వల్లే చనిపోయాడు.. ఐఐటీ బాంబే స్టూడెంట్ సాహిల్ వాకోడే తండ్రి ఆరోపణ

Caption of Image.

ముంబై: ఐఐటీ బాంబే సెకండియర్ విద్యార్థి సాహిల్ వాకోడే (22) సూసైడ్​పై అతడి తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడిని ఓ ప్రొఫెసర్ మూడు నెలలుగా కుల వివక్ష వ్యాఖ్యలతో వేధించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ను నిందితుడిగా చేర్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్‌‌‌‌కు బదిలీ చేశామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. మరోవైపు, క్యాంపస్‌‌‌‌లో ఎలాంటి కుల వివక్ష లేదని, ప్రతి విద్యార్థి కుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంటాయని ఐఐటీ బాంబే సీనియర్ అధికారి స్పష్టం చేశారు.

అతడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు

మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాకు చెందిన సాహిల్ వాకోడే.. ఐఐటీ బాంబేలో ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. శుక్రవారం జరిగిన మిడ్- సెమిస్టర్ పరీక్షకు అతడు మొబైల్‌‌‌‌ఫోన్‌‌‌‌తో అటెండ్ అయ్యాడు. పరీక్ష పత్రాన్ని చాట్ జీపీటీలో అప్‌‌‌‌లోడ్ చేసి జవాబులు వెతుకుతూ దొరికిపోయాడు. అయితే, ఈ ఘటనకు సంబంధించి వాకొడేపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని ఐఐటీ బాంబే ఒక ప్రకటనలో తెలిపింది. 
కోర్సు ఇన్‌‌‌‌స్ట్రక్టర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌‌‌‌మెంట్ స్వయంగా సాహిల్‌‌‌‌తో మాట్లాడి  కౌన్సెలింగ్ ఇచ్చారని చెప్పింది. అతడి అకడమిక్ కెరీర్‌‌‌‌‌‌‌‌పై ఎలాంటి ప్రభావం పడబోదని భరోసా ఇచ్చినట్టు పేర్కొంది. అయినప్పటికీ, తీవ్ర మనస్తాపానికి గురైన సాహిల్ హాస్టల్ గదిలోని ఫ్యాన్‌‌‌‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై క్యాంపస్‌‌‌‌లో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఐఐటీ బాంబే క్యాంపస్‌‌‌‌లో ఏడు నెలల్లో ఇది మూడో ఆత్మహత్య కావడం తీవ్ర కలకలం రేపుతోంది. 
 

©️ VIL Media Pvt Ltd.