
Hanuman Ansh: కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). భక్తిరస చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని అందుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.329 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా గురించి నిర్మాత రాగిణి సోనా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా కుమార్తె గిరిజా జీ, ప్రేమగా అమ్మాజీ అని పిలిచే ఆమె, ఈ సినిమాను ఏకంగా 15 సార్లు చూశారట. అంతేకాదు ప్రతిసారీ హనుమాన్ ఎపిసోడ్ చూసినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారని రాగిణి తెలిపారు. గిరిజా జీ నీమ్ కరోలి బాబా కుమార్తె కావడంతో ఆయన భక్తుల్లో ఆమెకు ప్రత్యేకమైన పరిచయం ఉంది. ఆమెతో మాట్లాడటమే తమకు ఒక వరంగా భావించే భక్తులు చాలామంది ఉన్నారు. ఆమె ప్రశాంతమైన స్వభావంతో పాటు ఆశ్రమంలో వడ్డించే భోజనం కూడా బాబాను గుర్తు చేస్తుందని భక్తులు చెబుతుంటారు.
ఇలాంటి నేపథ్యంలో నీమ్ కరోలి బాబా జీవితానికి, ఆయన ఆధ్యాత్మిక ప్రభావానికి సంబంధించిన అంశాలతో రూపొందిన ‘హనుమాన్ అంశ్’ విడుదలకు ముందే చిత్ర బృందం గిరిజా జీని కలిసి ఆమె ఆశీస్సులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. నిర్మాత రాగిణి సోనా చెప్పిన వివరాల ప్రకారం, దర్శకుడు విశాల్ చతుర్వేదితో కలిసి ఆమె గిరిజా జీని సంప్రదించారు. సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో రాగిణికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. నీమ్ కరోలి బాబాపై సినిమా చేయాలనే ఆలోచన తనకు ఎలా వచ్చిందని గిరిజా జీ అడిగారట. రాగిణి తనకు ఆరేళ్ల వయసులోనే బాబాను కలిసిన విషయాన్ని చెప్పడంతో పాటు, ఈ సినిమా కోసం విశాల్ చేసిన పరిశోధన గురించి కూడా వివరించారు.
అయితే ఆ తర్వాత జరిగిన విషయం మాత్రం రాగిణిని ఆశ్చర్యపరిచిందని ఆమె తెలిపారు. తన కుటుంబానికి సంబంధించిన దాదాపు 50 ఏళ్ల క్రితం నాటి వివరాలు, ఆగ్రాలో ఉన్న తమ పాత ఇంటి లొకేషన్, తన అన్నయ్య పేరు వంటి విషయాలను గిరిజా జీ ముందుగానే ఎలాంటి సమాచారం లేకుండా చెప్పారని రాగిణి వెల్లడించారు. ఆ వివరాలు తనకు ఎలా తెలుసని అడిగినప్పుడు గిరిజా జీ చెప్పిన సమాధానం కూడా తనను ఆలోచనలో పడేసిందని ఆమె పేర్కొన్నారు. రా గిణి సోనా మాత్రం గిరిజా జీతో జరిగిన ఆ అనుభవాన్ని ఈ సినిమా ప్రయాణంలో చాలా ప్రత్యేకమైన సంఘటనగా గుర్తుచేసుకుంటున్నారు. ఈ సినిమా కథాంశంలో బాబా నడిపిన కైంచి ధామ్ ఆశ్రమానికి సంబంధించిన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఎంతో అద్భుతంగా చూపించడంతో బాబా భక్తులందరూ కూడా ఈ సినిమాకు థియేటర్లలో బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం గిరిజా జీ ఈ సినిమాను 15 సార్లు చూసి ఎమోషనల్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.