July 19, 2026

Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!

Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
Reading Time: < 1 minute
Anna Lezhneva Visits Tirumala On Foot Prays For Pawan Kalyan Speedy Recovery

Anna Lezhneva Visits Tirumala: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా మరోసారి తన భక్తిని చాటుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరగడంతో ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటూ అలిపిరి నడక మార్గం ద్వారా కాలినడకన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గతంలో కుమారుడి మార్క్ కోసం మొక్కు తీర్చుకున్న ఆమె.. ఇప్పుడు భర్త ఆరోగ్యం కోసం శ్రీవారిని దర్శించుకున్నారు.

శుక్రవారం అలిపిరి నుంచి మెట్ల మార్గంలో అన్నా లెజినోవా దాదాపు నాలుగు గంటల పాటు నడిచి తిరుమల చేరుకున్నారు. ప్రయాణంలో భక్తులతో కలిసి నడుస్తూ, మార్గమధ్యంలోని ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల చేరుకున్న ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

శనివారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న అనంతరం శ్రీవారిని దర్శించుకున్న అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని, ఆయనకు ఆయురారోగ్యాలు, శక్తి ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించగా.. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. ఆలయ పరిసరాల్లో ఆమెను గుర్తించిన భక్తులు అభివాదం చేయగా.. అన్నా లెజినోవా చిరునవ్వుతో వారికి స్పందించారు.

తన తిరుమల యాత్రకు సంబంధించిన ఫొటోలు, అనుభవాలను అన్నా లెజినోవా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన కొండెక్కడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని, ప్రయాణం కొంత శ్రమతో కూడుకున్నప్పటికీ మనసుకు అపారమైన ప్రశాంతతను ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికాగా, ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ అన్నా లెజినోవా చేసిన తిరుమల పాదయాత్ర చేశారు. ప్రస్తుతం ఆమె తిరుమల యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.