July 19, 2026

Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్‌తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..

Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్‌తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
Reading Time: 2 minutes
Sebi Issues Alert On Ai Deepfake Boss Scam Targeting Listed Companies

కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి జరుగుతున్న సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (SEBI) లిస్టెడ్ కంపెనీలు, నియంత్రిత సంస్థలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘బాస్ స్కామ్’ (Boss Scam) లేదా CEO/MD ఇంపర్సనేషన్ స్కామ్ పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏమిటి ‘బాస్ స్కామ్’?

ఈ మోసంలో సైబర్ నేరగాళ్లు కంపెనీ CEO, మేనేజింగ్ డైరెక్టర్ (MD) లేదా ఇతర ఉన్నతాధికారుల్లా నటిస్తూ ఉద్యోగులను మోసం చేస్తారు. ఇందుకోసం వారు AI ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, మాల్వేర్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఫైనాన్స్ లేదా అకౌంట్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు అత్యవసరంగా నిధులు బదిలీ చేయాలని ఆదేశాలు పంపిస్తారు. ఈ సందేశాలు నిజమైన అధికారుల నుంచి వచ్చినట్లుగా కనిపించేలా రూపొందిస్తారు.

ఎలా మోసం చేస్తున్నారు?

సెబీ తెలిపిన వివరాల ప్రకారం, మోసగాళ్లు… ఇమెయిల్, WhatsApp, Microsoft Teams లేదా ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా CEO లేదా MD పేరుతో సంప్రదిస్తారు. “ఇది అత్యంత గోప్యమైన విషయం” అంటూ వెంటనే డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి తెస్తారు. నిజమని నమ్మించేలా నకిలీ సోషల్ మీడియా గ్రూపులను కూడా సృష్టిస్తున్నారు. ZIP ఫైళ్ల రూపంలో మాల్వేర్ పంపించి, వాటిని ఓపెన్ చేయగానే కంప్యూటర్ లేదా మొబైల్‌ను హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసిన తర్వాత WhatsApp Web సెషన్‌ను స్వాధీనం చేసుకుని, అసలు ఉద్యోగి ఖాతా నుంచే ఇతరులకు చెల్లింపు సూచనలు పంపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లను కూడా మార్చి, నిజమైన అధికారుల స్థానంలో నకిలీ నంబర్లను చూపించేలా చేస్తున్నారు.

సెబీ సూచనలు

ఈ తరహా మోసాల నుంచి రక్షణ పొందేందుకు సెబీ సంస్థలకు పలు సూచనలు చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చిన ఆర్థిక లావాదేవీల సూచనలను వెంటనే అమలు చేయవద్దు. డబ్బు బదిలీ చేసే ముందు సంబంధిత అధికారిని ఫోన్ ద్వారా లేదా ప్రత్యక్షంగా సంప్రదించి నిర్ధారించుకోవాలి. సోషల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్‌లలో వచ్చిన సూచనల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవద్దు. తెలియని వ్యక్తులు పంపిన ZIP లేదా ఇతర ఎగ్జిక్యూటబుల్ ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకూడదు. కంపెనీల్లో సైబర్ భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలి.

సైబర్ మోసం జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి

ఏదైనా సైబర్ మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సెబీ సూచించింది. AI సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇలాంటి మోసాల ప్రమాదం కూడా పెరుగుతోందని, కంపెనీలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.