Reading Time: < 1 minute
Tiger Movement Triggers Panic In Polavaram District Tribal Villages

గడిచిన పది రోజులుగా జాడ లేని పెద్దపులి.. మళ్లీ పోలవరం జిల్లాలో సంచరిస్తూ కలకలం సృష్టిస్తుంది. జిల్లా పరిధిలోని రాజవొమ్మంగి మండలం చికిలింత గ్రామపంచాయతీ దుర్గానగర్ గిరిజన గ్రామంలో పెద్దపులి సంచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న పెద్దపులి.. ఇప్పటికే ఒక ఆవును చంపి తినేసిన ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మరో లేగ దూడపై పెద్దపులి దాడికి తెగబడింది.

అయితే అదృష్టవశాత్తూ లేగ దూడ పులి పంజా నుంచి తప్పించుకుని గాయాలతో బయటపడింది. గత పది రోజులుగా పులి జాడ కనిపించకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకోగా.. మళ్లీ దాడి ఘటన వెలుగులోకి రావడంతో భయాందోళనలు మరింత పెరిగాయి. దుర్గానగర్‌తో పాటు చికిలింత గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల ప్రజలు రాత్రివేళ బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి పెద్దపులిని పట్టుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.