Reading Time: 2 minutes
Watch Video: తలలో దిగిన కొడవలితో.. ఫోన్‌ చూసుకుంటూ ఆసుపత్రికి నడిచి వెళ్లిన యువకుడు! ఆ తర్వాత సీన్‌ ఇదే

ముంబై, మే 11: మే 1న రాత్రి 11:45 గంటల సమయంలో మాంఖుర్డ్ ప్రాంతంలోని పీఎంజీపీ కాలనీలో ఇర్ఫాన్ చికెన్ షాప్ సమీపంలో రోహిత్ నాగనాథ్ పవార్‌ (27) అనే యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో కొడవలితో దాడి చేయగా అతడి తల పుర్రె ఎడమవైపున దిగింది. అయితే సృహ కోల్పోని రోహిత్‌ వెంటనే తలలో దిగిన కొడవలితో స్వయంగా నడుచుకుంటూ సియోన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. వైద్య సహాయం కోసం వేచి వున్న రోహిత్‌ ఫోన్‌ స్క్రోల్‌ చేసుకుంటూ ఆస్పత్రి ప్రాంగణంలో నిలబడి కనిపించాడు. అంతే అతడిని చూసిన జనాలు షాక్‌ అయ్యారు. ఆస్పత్రి సిబ్బంది కూడా తక్షణ చికిత్స అందించకుండా రోహిత్‌ను నిలబెట్టి ఉంచడం వీడియోలో చూడొచ్చు. కొద్ది సేపటి తర్వాత రోహిత్‌ను లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. అతడి తలలో ఇరుక్కున్న కొడవలిని బయటకు తీసేందుకు అక్కడి డాక్టర్లు క్లిష్టమైన సర్జరీ నిర్వహించారు. రోహిత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అయితే వైద్య పర్యవేక్షణలో అతడిని ఉంచినట్లు డాక్టర్లు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు రోహిత్‌పై దాడి సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నిందితులైన ముగ్గురు మైనర్‌ బాలురను మే 2న అరెస్ట్ చేశారు. గతంలో రోహిత్‌కు గౌతమ్‌ అనే యువకుడితో వివాదం ఉంది. ఈ గొడవ నేపథ్యంలో ముగ్గురు మైనర్ బాలురు రోహిత్‌పై దాడి చేశారు. వారిలో ఒకడు అతడిపై కత్తితో దాడి చేస్తే.. మిగతా ఇద్దరూ కాళ్లతో తన్ని, పిడిగుద్దులతో కొట్టారు. వెంటనే అక్కడికి వచ్చిన రోహిత్‌ తండ్రి నాగ్నాథ్ పవార్ రోహిత్‌ను మొదట గోవండిలోని శతాబ్ది ఆసుపత్రికి, ఆ తర్వాత సియోన్ ఆసుపత్రికి తరలించారు.

సియోన్ ఆసుపత్రిలోని వైద్యులు రోహిత్ ప్రాణాలతో బయటపడటానికి కారణం, కత్తి దూసుకెళ్లిన ప్రదేశమే కారణమని లోకమాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ సియోన్ ఆసుపత్రిలోని న్యూరోసర్జరీ డీన్‌ ప్రొఫెసర్ అయిన డాక్టర్ బటుక్ దియోరా అన్నారు. చర్మం, కండరాలు, పుర్రె ఎముక, మెదడును కప్పి ఉంచే పొరల గుండా కత్తి దూసుకెళ్లడం వల్ల మెదడులోని అన్ని కీలక ప్రాంతాలకు తృటిలో ప్రమాదం తప్పిందని అన్నారు. అందుకే రోహిత్ పూర్తి స్పృహలో ఉన్నాడని, స్పష్టంగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.