Reading Time: 2 minutes
Tollywood: ఒకప్పుడు ఈవీవీ, రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు.. ఇప్పుడు ఏపీ ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా?

దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు 50కు పైగా సినిమాలను తెరకెక్కించిన ఆయన తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, జగపతిబాబు, సుమన్.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు తీశారు ఈవీవీ. ఇక ఈ దర్శకుడు తన కెరీర్ ప్రారంభలో రాజేంద్ర ప్రసాద్ తో ఎక్కువగా సినిమాలు చేశారు. అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, అలీ బాబా అరడజను దొంగలు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. ఇందులో ఆ ఒక్కటి అడక్కు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1993లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అయితే ఈ సినిమా యూనిట్ లో భాగంగా ఈవీవీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఒకాయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. ఆయన మరెవరో కాదు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు. తాజాగా ఆయన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో సీనియర్ నటుడు నటకిరీటీ రాజేందప్రసాద్ ను అనుకోకుండా కలిశారు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇదే సమయంలో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అదేంంటే.. ఈశ్వరరావు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

రాజేందప్రసాద్ తో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఇలా రాసుకొచ్చారు.. ‘ఒకప్పుడు సినీ రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నేను… ఈరోజు ప్రజల ఆశీస్సులతో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా సేవ చేసే స్థాయికి రావడం ఎంతో ఆనందంగా, భావోద్వేగంగా అనిపిస్తోంది. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని 33 ఏళ్ల తర్వాత అనుకోకుండా కలవడం మరింత ప్రత్యేకంగా మారింది. నేను నన్ను పరిచయం చేసుకోగానే ఆయన ఆశ్చర్యంతో… ‘అప్పటి నా అసిస్టెంట్ డైరెక్టర్ ఈశ్వరేనా… ఈనాడు ఎమ్మెల్యేగా!” అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం హృదయాన్ని తాకింది. ఆనాడు ప్రముఖ దర్శకుడు ఈ వి వి సత్యనారాయణ గారి వద్ద కలిసి పని చేసిన రోజుల్ని ఇద్దరం స్మరించుకున్నాం. సినిమా సెట్స్‌ నుంచి ప్రజాసేవ వేదిక వరకు సాగిన ఈ ప్రయాణం… కష్టానికి, నిబద్ధతకు, ప్రజల ఆశీస్సులకు నిదర్శనం. ప్రజాసేవే నా అసలు సినిమా… ప్రజల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’ అని ట్వీట్ చేశారు ఎచ్చెర్ల ఎమ్మెల్యే. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే ఎమ్మెల్యే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రాజేంద్రప్రసాద్ తో  ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.