Reading Time: 2 minutes
Sanju Samson Joins Shreyas Iyer In Team India T20 Captaincy Race Bcci Plans Major Change

Sanju Samson Joins Team India T20 Captaincy Race: భారత టీ20 జట్టు కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడనునట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025, 2026లో అటు కెప్టెన్, ఇటు బ్యాటర్‌గా అదరగొడుతున్న స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను టీమిండియా తదుపరి టీ20 కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేయనుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు కెప్టెన్సీ రేసులోకి మరో స్టార్ క్రికెటర్ వచ్చాడని తాజా నివేదికలు చెబుతున్నాయి. అతడు మరెవరో కాదు.. కేరళ కింగ్, టీ20 వరల్డ్ కప్ 2026 స్టార్ సంజు శాంసన్.

ఐపీఎల్‌ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సంజు శాంసన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సెంచరీ, హాఫ్ సెంచరీలతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజు నిలిచాడు. ప్రస్తుతం అతడు సీఎస్‌కే కెప్టెన్ కాకపోయినా.. గతంలో రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వచించాడు. అంతేకాదు జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఆ అనుభవం సంజుకి పెద్ద ప్లస్‌గా మారింది. జట్టును ముందుండి నడిపించే సామర్థ్యం, ప్రశాంత స్వభావం, అంతర్జాతీయ అనుభవం కారణంగా సంజును బీసీసీఐ సెలెక్టర్లు సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

జూన్, జూలై నెలల్లో భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఈ వైట్‌బాల్ సిరీస్‌ల కోసం ఎంపిక చేసే జట్టులో ఐపీఎల్ 2026 ప్రదర్శన కీలక పాత్ర పోషించనుంది. ఈ క్రమంలో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ మాత్రం వరుస ఐపీఎల్‌లలో పరుగులు చేస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. నివేదికల ప్రకారం.. సంజు కు అనుకూలంగా ఉన్న ప్రధాన అంశం టీ20 అనుభవం. 2024 టీ20 ప్రపంచకప్ నుంచి భారత జట్టులో కొనసాగుతున్న సంజూ.. అంతర్జాతీయ స్థాయిలో తనను తాను నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు 62 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతడు 1,399 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది భారత్ గెలిచిన టీ20 ప్రపంచ కప్‌లో కూడా సంజు కీలక పాత్ర పోషించాడు.

ఇక శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ.. అతడు చాలా కాలంగా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. చివరిసారిగా 2023 డిసెంబర్ 3న భారత తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. దీంతో నేరుగా జట్టులోకి తిరిగి వచ్చి కెప్టెన్ అవడం అంటే.. కాస్త కష్టమే అని కొందరు భావిస్తున్నట్లు సమాచారం. అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ తక్షణమే సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించే ఆలోచనలో లేదని తెలుస్తోంది. బ్యాటర్‌గా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు టీమిండియా కెప్టెన్సీ రేసులో శ్రేయస్, సంజు నిలిచారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఎవరు కెప్టెన్‌గా ఉంటారనేది త్వరలోనే తెలియరానుంది.