
హజ్ యాత్రికులపై ఎలాంటి భారం పడకుండా ఆ భారాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. నాంపల్లి హజ్ హౌజ్‌లో హజ్ యాత్రికుల బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘‘సంక్షేమంలో మైనారిటీల వాటాను వారికి అందిస్తున్నాం. గత ఏడాది హజ్ యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో 44 మంది మృతి చెందారు.ప్రతి మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇచ్చి ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంది. ఉద్యోగాల్లో.. సంక్షేమ పథకాల్లో మైనారిటీలకు దక్కాల్సిన వాటాను వారికి అందిస్తున్నాం. విదేశీ విద్య విషయంలోనూ మైనారిటీలకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాం. వైట్ కాలర్ జాబ్స్ కంటే ప్రస్తుతం బ్లూ కాలర్ జాబ్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. అమెరికా కంటే జర్మనీ, జపాన్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. అందుకే ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసి యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం.’’ అని తెలిపారు.
‘‘ఇక హైదరాబాద్‌లో చాలామంది మైనారిటీ సోదరులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ ఆటోలుగా మార్చాలని నిర్ణయించాం. దీంతో ఆటో డ్రైవర్లకు డబ్బులు ఆదా అవుతాయి. ఇరాన్, ఇరాక్ యుద్ధంతో విమాన ఇంధన ఛార్జీలు పెరిగాయి. దీంతో విమాన ప్రయాణం ఛార్జీలు పెరిగాయి. మాకు హిందూ-ముస్లిం భేదాభిప్రాయం లేదు. హిందూ ముస్లిం భాయీ భాయీ. సర్ పేరుతో తెలంగాణలో ఓట్లు తొలగించాలని చూస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు మన రాష్ట్రంలో జరగనివ్వద్దు. మనందరం కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలి. సంక్షేమం అభివృద్ధిలో మైనారిటీల వాటా వారికి అందిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం.’’ అని పిలుపునిచ్చారు.