Reading Time: < 1 minute

లోకేశ్వర్ మండలంలోని గోదావరి తీరాన నాగవీరుడు, భైరవుడి శిల్పాలు

Caption of Image.

నిర్మల్, వెలుగు: లోకేశ్వర్ మండలంలోని గోదావరి ఒడ్డున ఉన్న ప్రాచీన బ్రహ్మేశ్వర్ ఆలయ ప్రాంగణంలో 9  నుంచి 12వ శతాబ్దం మధ్యకాలానికి సంబంధించిన అరుదైన శిల్పాలు, విగ్రహాలు వెలుగులోకి వచ్చినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. ఇందులో నాగవీరుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని చెప్పారు. అప్పటి నాగారాధనకు ప్రతీకగా లేదా యుద్ధంలో వీరమరణం పొందిన యోధుడి జ్ఞాపకార్థంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. 

అదేవిధంగా గుర్రంపై కత్తి, డాలు ధరించి యుద్ధానికి సాగుతున్న వీరుడి రూపంతో కూడిన మరో వీరగల్లు శిల్పాన్ని కూడా పరిసర ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపారు. ఈ గోదావరి తీర గ్రామాల్లో భైరవ సంప్రదాయం విస్తృతంగా ఆచరణలో ఉన్నట్లు ఇక్కడ లభిస్తున్న భైరవ విగ్రహాలను బట్టి తెలుస్తోందన్నారు. ఆలయ పరిసరాల్లో చతుర్భుజ భైరవుడు, లజ్జాగౌరీ విగ్రహాలు కూడా లభించాయన్నారు. లజ్జాగౌరి విగ్రహం జైన సంప్రదాయానికి చెందిన యక్షిణి శిల్పాన్ని పోలి ఉందని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.