
హైదరాబాద్, వెలుగు: ఐడీపీఎల్ కు కేటాయించిన భూముల స్వాధీనానికి ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌పై సత్వర విచారణ చేపట్టి పరిష్కరించాలని సింగిల్ జడ్జికి సూచించింది.
ఐడీపీఎల్‌కు కేటాయించిన 891.38 ఎకరాలను స్వాధీనం చేసుకుని టీజీఐఐసీకి అప్పగించాలంటూ 2008లోకలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని బీఐఎఫ్‌ఆర్ అదే ఏడాది ఇచ్చిన ఉత్తర్వులపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ఐడీపీఎల్ శుక్రవారం హౌస్‌మోషన్ పిటిషన్ వేసింది.
దీనిపై జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ విచారణ చేపట్టారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉందని, అది తేలకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా భూమి స్వాధీనానికి చర్యలు తీసుకోరాదంటూ సర్కారును ఆదేశించింది.