Reading Time: < 1 minute

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా..గోడ కూలి నలుగురు రైతులు చనిపోవడం బాధాకరం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Caption of Image.
  • కలెక్టర్​తో కలిసి బాధిత రైతు కుటుంబాలకు పరామర్శ

లక్సెట్టిపేట/దండేపల్లి, వెలుగు:  మంచిర్యాల జిల్లాలో గోడ కూలిన ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన లక్షెట్టిపేట మండలం కొత్తూరులో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌‌‌‌‌‌‌‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ..రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో గోడ కూలి నలుగురు రైతులు మృతి చెందడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలను పరామర్శించి, వారిని ఓదార్చారు. కొత్తూరుకు చెందిన వెంకటేశ్, గంపలపల్లిలో తండ్రీకొడుకులు తనుగుల నాగరాజు, అభిరామ్, అలాగే.. దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నెల్కి లచ్చన్న కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ముత్యంపేటకు చెందిన మృతుడు లచ్చన్న కుమారుడు మనోజ్ ఐటీఐ పూర్తి చేసినట్లు తెలుసుకున్న ఎంపీ.. అతనికి తక్షణమే ఏదైనా ప్రభుత్వ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్‌‌‌‌కు సూచించారు.

ధాన్యం రవాణాపై అధికారులకు ఆదేశాలు

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపులో రైతులు ఇబ్బంది పడకూడదని అధికారులను ఎంపీ వంశీకృష్ణ  స్పష్టం చేశారు. లారీల సమస్యను తక్షణమే పరిష్కరించి, కొత్తూరు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే వెంకట్రావుపేట గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కార్యక్రమంలో లక్షెట్టిపేట, దండెపల్లి తహసీల్దార్లు దిలీప్ కుమార్, రోహిత్ దేశ్‌‌‌‌పాండే, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దమ్మ సునీల్, కొండ నరేశ్, పత్తిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.