Reading Time: 2 minutes
Vijayawada School Teacher Acid Attack On 3 Year Old Girl

అక్షరాలు నేర్పించాల్సిన గురువే కాలయముడిలా మారింది. విజయవాడ విద్యాధరపురంలోని ‘నేషనల్ ప్లే స్కూల్’లో జరిగిన ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం మూడు సంవత్సరాల వయస్సున్న పసిపాపపై ఒక స్కూల్ టీచర్ యాసిడ్ పోసి తీవ్రంగా గాయపరిచిన ఘటన సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.

ఫిబ్రవరి 23వ తేదీన పాప తల్లి తన కూతురిని యథావిధిగా స్కూల్ దగ్గర దింపి వెళ్లారు. అయితే, కాసేపటికే స్కూల్ నుండి తల్లికి ఫోన్ వచ్చింది. “మీ పాప బాత్‌రూమ్‌లో పడిపోయింది, దెబ్బలు తగిలాయి” అని టీచర్ సమాచారం అందించారు. కంగారుగా స్కూల్‌కు చేరుకున్న తల్లి, ఏడుస్తున్న చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించాక అసలు నిజం బయటపడింది. పాప ఒంటిపై ఉన్న గాయాలు పడిపోవడం వల్ల వచ్చినవి కావు, అవి యాసిడ్ పోయడం వల్ల కలిగిన కాలిన గాయాలని వైద్యులు ధృవీకరించారు.

Gold Rates: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..

వైద్యుల మాటలతో దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. మొదట బుకాయించినప్పటికీ, గట్టిగా అడిగేసరికి టీచర్ అమానుషంగా పాపపై యాసిడ్ పోసినట్లు యాజమాన్యం అంగీకరించింది. ఆసుపత్రి బిల్లు కట్టిన యాజమాన్యం, ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయాలని, కొంత డబ్బు తీసుకుని రాజీకి రావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చింది. అయితే, తమ అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురికి జరిగిన అన్యాయంపై రాజీ పడటానికి తల్లిదండ్రులు నిరాకరించారు.

తల్లిదండ్రులు వెనక్కి తగ్గకపోవడంతో స్కూల్ ప్రిన్సిపాల్ తన అసలు రూపాన్ని బయటపెట్టారు. ఈ విషయాన్ని బయట చెబితే మీ అంతు చూస్తామంటూ తల్లిదండ్రులకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా, నగర డీసీపీ (DCP) తమకు బంధువని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తమను ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు దిగారు. బాధితులు భయపడతారనే ఉద్దేశంతో అధికార బలాన్ని చూపిస్తూ యాజమాన్యం ఆడుతున్న ఈ నాటకం ఇప్పుడు కలకలం రేపుతోంది.

తమ కళ్లముందే చిన్నారి నరకయాతన అనుభవిస్తుంటే, కనీసం జాలి లేకుండా బెదిరింపులకు దిగుతున్న స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన టీచర్‌ను, దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన ప్రిన్సిపాల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Social Media Ban : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సోషల్ మీడియా బ్యాన్