Reading Time: < 1 minute

ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తం : సీఎస్ రామకృష్ణారావు

Caption of Image.
  • టీజేఏసీ నేతలతో సీఎస్ రామకృష్ణారావు 

హైదరాబాద్, వెలుగు: ఉపాధ్యాయ, ఉద్యోగ, ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఏ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఆర్థికపరమైన అంశాలపై బడ్జెట్ సమావేశాల అనంతరం ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం తెలంగాణ టీచర్స్ జేఏసీ  చైర్మన్ నాగులవంచ చంద్రశేఖర్ రావు, సెక్రటరీ జనరల్ శానమోని నర్సిములు, గౌరవ అధ్యక్షుడు హర్షవర్థన్ రెడ్డి నేతృత్వంలోని బృందం సచివాలయంలో సీఎస్‌‌‌‌‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందజేసింది.

సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ అమలు, నగదు రహిత వైద్యానికి హెల్త్ కార్డులు వంటి డిమాండ్లను సీఎస్ దృష్టికి జేఏసీ నేతలు తీసుకెళ్లారు. లాంగ్వేజీ పండిట్లు, పీఈటీల అప్‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్‌‌‌‌‌‌‌‌ చేయాలని కోరారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గురుకులాల్లో సమస్యల పరిష్కారం, గెస్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ  వంటి 28 అంశాలను 
వినతిపత్రంలో పొందుపరిచారు. ఆర్థికేతర అంశాలను ఆయా శాఖల అధికారులకు పంపిస్తానని.. వారిని కలవాలని సీఎస్ సూచించినట్టు జేఏసీ నేతలు పేర్కొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.