Reading Time: 2 minutes

మీ వంటింట్లో వాడే పసుపు, కారం, మసాలాలు స్వచ్ఛమైనవేనా.. ? ఇలా ఈజీగా చూడగానే చెప్పేయొచ్చు..

Caption of Image.

మనం రోజూ వంటల్లో వాడే మసాలా దినుసులు ఎంతవరకు అసలైనవో లేక కల్తీవో ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ రోజుల్లో మార్కెట్‌లో దొరికే రకరకాల వస్తువుల్లో కల్తీ విపరీతంగా పెరిగిపోయింది. మనం ఎంతో ఇష్టంగా వండుకునే కూరల్లో వేసే మసాలాలు స్వచ్ఛమైనవేనా…  కాదా…  అని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తెలుసుకోవచ్చో ఇక్కడ చూద్దాం!

1. పసుపు (Turmeric)
మన వంటగదిలో పసుపు లేనిదే ఏ కూరా రుచిగా ఉండదు. పసుపు అసలైనదా లేక నకిలీదా అని తెలుసుకోవడానికి ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు…
*మొదట ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ పసుపు వేయండి. పసుపు ఎలాంటి హడావుడి లేకుండా నెమ్మదిగా అడుగుకు వెళుతుంటే అది అసలైన పసుపు. ఒకవేళ పసుపు నీటిలో వేయగానే రంగును వదులుతూ, నీరంతా పసుపు రంగులోకి మారిపోతే మాత్రం అది కల్తీ పసుపు అని తెలుసుకోవాలి. 

2. ఎర్ర కారం పొడి (Red Chilli Powder)
కారంలో ఎక్కువగా ఇటుక పొడి, రంగులు లేదా మైదా పిండి కలుపుతుంటారు. కానీ దీన్ని ఇలా ఈజీగా పసిగట్టవచ్చు. ఒక గ్లాసు నీటిలో 2 టీస్పూన్ల కారం పొడి వేసి కలపండి.  కారం వేయగానే  వెంటనే కరిగిపోయి ఎరుపు రంగులోకి మారిపోతే అందులో కృత్రిమ రంగులు కలిపారన్నమాట.

అదే స్వచ్ఛమైన కారమైతే, నీటిలో నెమ్మదిగా కరుగుతుంది ఇంకా కొన్ని కారపు పొడులు నీటి పైభాగంలో తేలుతుంటాయి. మరో పద్ధతి ఏమిటంటే, కొద్దిగా కారం పొడిని అరచేతిలో వేసుకుని రుద్ది చూడండి. అది గరుకుగా తగిలితే కల్తీ జరిగినట్లే!

3. జీలకర్ర (Cumin Seeds)
ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర అసలైనదైతే రంగు మారకుండా నీటి అడుగుభాగానికి చేరుతుంది. నకిలీ జీలకర్ర అయితే నీటిలో తేలుతూ ఉంటుంది, అంతేకాదు దానికి సరైన వాసన కూడా ఉండదు.

4. ధనియాల పొడి (Coriander Powder)
ధనియాల పొడి స్వచ్ఛతను పరీక్షించడానికి దానిని చేతిలో పట్టుకుని మంచిగా వాసన చూడండి. అసలైనదైతే మంచి సువాసన, కొద్దిగా తియ్యటి వాసన వస్తుంది. ఒక గ్లాసు నీటిలో 2 టీస్పూన్ల ధనియాల పొడి వేసి అర్ధగంట పాటు అలాగే వదిలేయండి. స్వచ్ఛమైన పొడైతే నీటి అడుగున చేరుతుంది.

5. గరం మసాలా (Garam Masala)
అసలైన గరం మసాలా  వాసన చూస్తే అందులో ఉన్న రకరకాల సుగంధ ద్రవ్యాల (యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వంటివి) సువాసన విడివిడిగా తెలుస్తుంది. అదే కల్తీదైతే కేవలం ఏదో ఒక రంగు, పిండి వాసన మాత్రమే వస్తుంది.

6. రాతి ఉప్పు (Rock Salt / Sendha Namak)
ఒక బంగాళాదుంపను సగానికి కోసి దానిపై రాతి ఉప్పు చల్లండి. తరువాత దానిపై కొన్ని చుక్కల నిమ్మరసం పిండండి. ఉప్పు స్వచ్ఛమైనదైతే బంగాళాదుంప రంగు ఏమాత్రం మారదు. అదే కల్తీ ఉప్పు అయితే, ఆ బంగాళాదుంప కాస్తా నలుపు లేదా నీలం రంగులోకి మారిపోతుంది!

ఇంట్లోని ఈ చిన్న చిన్న చిట్కాలతో మీ వంటింటి మసాలాలు ఎంత స్వచ్ఛమైనవో ఇట్టే కనిపెట్టేయవచ్చు!

©️ VIL Media Pvt Ltd.