Reading Time: 1 minute
మరింత విస్తరించిన ఉచిత బ్రేక్‌ఫాస్ట్‌.. పిల్లల మధ్య సీఎం.. నేలపై కూర్చొని విజయ్ బ్రేక్‌ఫాస్ట్!

తమిళనాడులో పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకం మరింత విస్తరించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం (సెప్టెంబర్ 22) చెన్నై తిరువాన్మియూర్‌లోని గాంధీ గ్రామం ప్రభుత్వ మిడిల్ స్కూల్‌లో పెరుంతలైవర్ కామరాజర్ ఉచిత అల్పాహార పథకం విస్తరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించిన ఆయన.. వారితో కలిసి పొంగల్ తిన్నారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.

ఇప్పటివరకు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అందుతున్న ఈ పథకాన్ని తాజాగా 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా వర్తింపజేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరో 15.30 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి రానున్నారు. ఈ విస్తరణ 15,454 ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లో అమలుకానుంది.

విద్యార్థులు ఉదయం అల్పాహారం లేకుండా పాఠశాలకు రావాల్సిన పరిస్థితిని తగ్గించడం, వారికి పోషకాహారం అందించడం, తరగతుల్లో ఏకాగ్రత పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది. విస్తరణ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.217.63 కోట్లు కేటాయించడంతో.. పథకం మొత్తం బడ్జెట్ రూ.724 కోట్లకు చేరింది. విద్యార్థులకు అందించే మెనూలో పొంగల్, సాంబార్, స్వీట్ వంటి అల్పాహార పదార్థాలు ఉన్నాయి.

ఈ పథకానికి గతంలో ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’గా పేరు ఉండగా.. 2026లో మాజీ ముఖ్యమంత్రి కె. కామరాజర్ పేరు మీదుగా ‘పెరుంతలైవర్ కామరాజర్ ఉచిత అల్పాహార పథకం’గా పేరు మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి విస్తరణ అమల్లోకి వచ్చింది. అయితే చెంగల్పట్టు, తిరుప్పూర్ జిల్లాల్లో ఉపఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో అక్కడ ఈ విస్తరణను తాత్కాలికంగా వాయిదా వేశారు. మొత్తంగా 6–8 తరగతుల విద్యార్థులను కూడా చేర్చడంతో తమిళనాడులో ఉచిత ఉదయపు భోజన పథకం పరిధి మరింత విస్తరించింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి..