
Nirmala Sitharaman: రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ (UPI) లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తిస్తుందని, ఇది వచ్చే నెల అక్టోబర్ 15 నుంచి అమలులోకి రానుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు రావడమే ఆలస్యం, సామాన్యుడి జేబుకు మళ్లీ చిల్లు పడబోతోందా అనే చర్చ ఊపందుకుంది. ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచాయి. సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఈ రూమర్లపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా స్పందించారు. సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు.
ఈ రగడపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆర్థిక మంత్రి తీవ్రంగా ఖండించారు. రూ.2,000 కంటే తక్కువ ఉండే యూపీఐ లావాదేవీలకు ఈ ఎండీఆర్ ఛార్జీలు వర్తించవని ఆమె తేల్చి చెప్పారు. పార్లమెంట్ సమావేశాల సమయంలోనే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ ఇచ్చామని గుర్తుచేశారు. ప్రభుత్వంపై దాడి చేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి అసత్య ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యూపీఐ ద్వారా వసూలు చేసే ఎండీఆర్ అనేది పన్ను (Tax) లేదా సెస్ (Cess) కాదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ డబ్బులేవీ ప్రభుత్వం ఖాతాలోకి లేదా కన్సోలిడేటెడ్ ఫండ్‌లోకి వెళ్లవు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, యూజర్లకు మెరుగైన సేవలందించడానికి సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే ఈ ఛార్జీలను తీసుకుంటారు. పైగా ఇది యూపీఐ ఆపరేటర్ల మధ్య ఉండే అంతర్గత రుసుము మాత్రమేనని, ఆ భారాన్ని ఎంతమాత్రమూ వినియోగదారులపై వేయరని వివరించారు.
ఇక, ఈ యూపీఐ ఎండీఆర్ ఛార్జీల విధానంలో వేర్వేరు కేటగిరీలు ఉన్నాయి. రూ.2,000 దాటిన పేమెంట్లపై సాధారణంగా 0.4 శాతం వసూలు చేసినప్పటికీ, అన్ని రకాల లావాదేవీలకూ ఇది ఒకేలా ఉండదు. ఉదాహరణకు ఫ్లాట్-రేట్ మోడల్ కిందకు వచ్చే పెట్రోల్ బంక్ లావాదేవీల వంటి వాటికి గరిష్టంగా రూ.5 మాత్రమే ఫిక్స్డ్ ఎండీఆర్‌గా వసూలు చేస్తారు. వీటన్నిటితో పాటు, నెలకు రూ.1,00,000 వరకు లావాదేవీలు నిర్వహించే చిన్న వ్యాపారులకు ఊరటనిస్తూ వారిని ‘జీరో ఎండీఆర్’ కేటగిరీలో ఉంచారు. అంటే చిన్న వ్యాపారులు ఎలాంటి అదనపు రుసుమూ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరోవైపు, ఈ కొత్త ఛార్జీల నిబంధన అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నప్పటికీ, ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో దీని ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా వర్తకులు, వ్యాపారుల్లో తమకు వచ్చే లాభాల మార్జిన్ తగ్గిపోతుందేమోనన్న ఆందోళన మొదలైంది. పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే దీనికి సంబంధించిన గందరగోళం నెలకొంది. చాలా చోట్ల యూపీఐ ద్వారా కాకుండా నగదు (క్యాష్) చెల్లించాలంటూ వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ తరహా మార్పులు నేరుగా సామాన్యులపై ప్రభావం చూపుతున్నప్పటికీ, అసలు నిజమైన ప్రభావం ఏంటనేది అక్టోబర్ 15న ఛార్జీలు అమల్లోకి వచ్చాకే పూర్తి స్పష్టత రానుంది.