
టోక్యో: సుజుకీ కప్‌లో భాగంగా జపాన్‌తో జరిగిన ఏకైక టీ20లో టీమిండియా విజయం సాధించింది. అతిథ్య జట్టుపై రెండు పరుగుల తేడాతో అతి కష్టం మీద నెగ్గి అయ్యర్ సేన పరువు కాపాడుకుంది. జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో టీమిండియా నిర్ణీత ఐదు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 రన్స్ చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16) రాణించాడు. చేధనలో జపాన్ 30 రన్స్‌కే ఆలౌటై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జపాన్ ఓపెనర్ కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ (12) రన్స్ చేసి విజయం కోసం పోరాడాడు. ఈ మ్యాచులో ఓటమి పాలైనప్పటికీ ప్రపంచ ఛాంపియన్ ఇండియాను జపాన్ వణికించింది.
వణికించిన జపాన్ బౌలర్స్
సానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా ఐదు ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు జపాన్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో ఊహించని షాక్ ఇచ్చారు. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ తీవ్రంగా నిరాశపర్చాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ 7 బంతులు ఎదుర్కొని 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా తీవ్రంగా నిరాశపర్చాడు. కేవలం 3 రన్స్ మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. దీంతో ఇండియన్ టీమ్ 14 పరుగులకే కీలకమైన 3 వికెట్లని కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16) క్రీజ్‌లో నిలబడి జట్టును ఆదుకున్నాడు. జపాన్ బౌలర్లలో చార్లీ హారా హింజే రెండు వికెట్లు తీయగా.. బెంజమిన్ ఇటో-డేవిస్, ఇబ్రహీం తకాహాషి చెరో వికెట్ తీశారు.
చివరి వరకు పోరాడిన జపాన్
33 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన తొలి ఓవర్ వేసినప్పటికీ, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌లను జపాన్ బ్యాటర్లు లక్ష్యంగా చేసుకున్నారు. రవి బిష్ణోయ్ వేసిన 4వ ఓవర్లో జపాన్ ఏకంగా 10 పరుగులు రాబట్టడంతో.. ఆఖరి ఓవర్లో జపాన్ విజయానికి 6 బంతుల్లో 8 పరుగులుగా సమీకరణం మారింది. అక్షర్ పటేల్ వేసిన చివరి ఓవర్ లో హైడ్రామా నడిచింది.
అక్షర్ వరుసగా రెండు వైడ్ బంతులు వేయడంతో, జపాన్ విజయానికి 4 బంతుల్లో 5 పరుగులకు పడిపోయింది. ఈ దశలో అక్షర్ తన అనుభవాన్నంతా ఉపయోగించి కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతుల్లో వేసి జపాన్ బ్యాటర్లను కట్టడి చేశాడు. దీంతో టీమిండియా రెండు పరుగుల తేడాతో గట్టెక్కింది. తద్వారా సంచలనం విజయాన్ని జపాన్ తృటిలో చేజార్చుకోగా.. భారత జట్టు భారీ అవమానం నుంచి బయటపడి ఆసియా గేమ్స్ ప్రిపరేషన్‌ను గెలుపుతో ముగించింది.