
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ దగ్గర వినాయక నిమజ్జనాలు ఊపందుకున్నాయి. మంగళవారం ( సెప్టెంబర్ 22 ) మధ్యాహ్నానికి దాదాపు రెండు కిలోమీటర్ల మేర నిమజ్జనం కోసం వచ్చిన విగ్రహాలు భారీగా క్యూ లైన్లో ఉన్నాయి. పరిసర ప్రాంతాల నుంచి భారీ టస్కర్లు, వాహనాల మీద రకరకాల గణనాధుల విగ్రహాలతో నిమజ్జనం కోసం గంటల తరబడి వెయిటింగ్ లో ఉన్నాయి. అయితే.. మునుపటిలాగా ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనాలకు అనుమతి లేకపోవడంతో ఈసారి కొద్దిగా కల తగ్గిందనే చెప్పాలి.
హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నుంచి నిమజ్జనాలకు అనుమతి లేదని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. ట్యాంక్ బండ్ పై నుంచి విగ్రహాలు వేయకుండా 10 ఫీట్ల రెయిలింగ్ఎఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్లలో ఏర్పాటు చేసిన క్రేన్ల నుంచి కేవలం మట్టి, పర్యావరణ హిత విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేస్తున్నారు.
అలాగే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాండ్లలోనే నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు.
ట్యాంక్ బండ్ పై నుంచి నిమజ్జనం లేదని అధికారులు ప్రకటించడాన్ని గణేశ్ ఉత్సవ సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. ట్యాంక్ బండ్ సంప్రదాయ నిమజ్జన ప్రాంతమని, అక్కడే విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.