Reading Time: 2 minutes

అక్టోబర్ 15 నుంచి UPI పై ఛార్జీలు: ఎప్పుడు క్రెడిట్ కార్డ్ వాడాలి? ఎక్కడ యూపీఐ పేమెంట్ చేయాలి?

Caption of Image.

దేశంలో డిజిటల్ పేమెంట్స్ విప్లవానికి నాంది పలికిన UPI లావాదేవీల విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అక్టోబర్ 15, 2026 నుంచి పర్సన్-టు-మర్చంట్ అంటే షాపుల్లో వ్యాపారులకు చేసే చెల్లింపుల విషయంలో కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అయితే ఈ కొత్త రూల్స్ నేపథ్యంలో సాధారణ వినియోగదారులు ఏయే సందర్భాల్లో యూపీఐ వాడాలి, ఎలాంటి చెల్లింపులకు క్రెడిట్ కార్డులను ఎంచుకోవడం లాభదాయకం అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.. 

యూపీఐ కొత్త మర్చంట్ ఛార్జీలు ఏమిటి?
రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే మర్చంట్ యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుంది. రూ.75వేలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఈ ఛార్జీ గరిష్టంగా రూ.300కు పరిమితం చేయబడింది. అయితే రూ.2 వేల లోపు లావాదేవీలు, వ్యక్తుల మధ్య జరిగే పర్సన్-టు-పర్సన్ ట్రాన్సాక్షన్లపై ఎప్పుడూ పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి. ఈ ఛార్జీలను నేరుగా వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా వ్యాపారులే కట్టాల్సి ఉంటుంది. అయినప్పటికీ.. రివార్డులు, ప్రయోజనాల దృష్ట్యా ఏ పేమెంట్ మోడ్ ఎంచుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం.

ఏ సమయంలో యూపీఐ పేమెంట్స్ చేయడం లాభదాయకం?

1. చిన్న రోజూవారీ ఖర్చులు: రూ.2వేల లోపు ఉండే చిల్లర ఖర్చులు, కూరగాయలు, కిరాణా సామాన్లు, సాధారణ కొనుగోళ్లకు ఎప్పుడూ యూపీఐ ద్వారానే పేమెంట్ చేయడం బెటర్. దీనివల్ల ఎలాంటి అదనపు రుసుములు ఉండవు.

2. చిన్న వ్యాపారులు: నెలకు రూ.లక్ష వరకు టర్నోవర్ ఉండే చిన్న వ్యాపారులు, క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు స్వీకరించే చిన్న స్థాయి దుకాణదారులకు జీరో ఎండీఆర్ వర్తిస్తుంది. కాబట్టి వీరికి యూపీఐ ద్వారానే చెల్లింపులు చేయడం మంచిది.

3. వెంటనే బ్యాంక్ అకౌంట్ డెబిట్ కోరుకునేవారు: క్రెడిట్ కార్డుల వాడకం వల్ల అప్పుల ఊబిలో పడతామని భావించేవారు.. నేరుగా తమ బ్యాంకు ఖాతా నుంచి రియల్ టైమ్‌లో డబ్బులు కట్ అయ్యేలా చూసుకోవాలనుకునే వారికి యూపీఐ పేమెంట్స్ బెస్ట్ ఛాయిస్. 

ఎలాంటి సమయంలో క్రెడిట్ కార్డు వాడి పేమెంట్స్ చేయడం లాభం?

1. పెద్ద మొత్తంలో షాపింగ్: ఉదాహరణకు రూ.10వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు క్రెడిట్ కార్డు వాడడం చాలా లాభదాయకం. సాధారణ బ్యాంక్ అకౌంట్ యూపీఐ పేమెంట్‌పై ఎలాంటి క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు రావు. అదే క్రెడిట్ కార్డు వాడితే క్యాష్‌బ్యాక్స్ రివార్డ్ పాయింట్ల రూపంలో ప్రయోజనం పొందొచ్చు. 

2. ఈఎంఐ సౌలభ్యం: క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించినప్పుడు డబ్బులు వెంటనే మీ ఖాతా నుంచి కట్ కావు. బిల్లు చెల్లించడానికి ఎక్కువ గడువు లభిస్తుంది. అలాగే పెద్ద ఎత్తున ఖర్చు చేసేటప్పుడు ఆ మొత్తాన్ని EMI కింద మార్చుకునే వెసులుబాటు కూడా క్రెడిట్ కార్డు ద్వారానే సాధ్యమవుతుంది.

3. రూపే క్రెడిట్ కార్డుల వాడకం: రూపే క్రెడిట్ కార్డులను యూపీఐకి అనుసంధానించి చిన్నచిన్న కొనుగోళ్లు చేసినా రివార్డులు, లాయల్టీ పాయింట్లు లభిస్తాయి. కాబట్టి రివార్డులు అందించే కార్డులను ఉపయోగించడం ద్వారా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

©️ VIL Media Pvt Ltd.