Reading Time: 2 minutes
Bis Certification Mandatory Smartphone Screen Protectors India 2027

BIS Certification: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరు మొదటి దాని ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తారు. ఫోన్ కొనగానే దానికి మంచి స్క్రీన్ ప్రొటెక్టర్ లేదా టెంపర్డ్ గ్లాస్ వేయించడం మనకు అలవాటు. అయితే, మనం షాపుల్లో కొనే ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్ ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు తీసొచ్చింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. క్వాలిటీ లేని, నాసిరకం స్క్రీన్ ప్రొటెక్టర్లకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ కొత్త నిబంధనల ప్రకారం.. బిఐఎస్ సర్టిఫికేషన్ అవసరమయ్యే వస్తువుల జాబితాలో ఇకపై స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లను కూడా చేర్చారు. తయారీదారులు నిర్దేశిత ‘IS 19348:2025’ భారతీయ ప్రామాణికం ప్రకారమే వీటిని తయారు చేయాల్సి ఉంటుంది. బిఐఎస్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకొని, వారి నుంచి అనుమతి పొందకుండా భారత మార్కెట్లో స్క్రీన్ ప్రొటెక్టర్లను చట్టబద్ధంగా అమ్మడం ఇకపై కుదరదు. అయితే ఈ రూల్స్ వెంటనే కాకుండా 2027 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా స్క్రీన్ ప్రొటెక్టర్లను విదేశాల నుంచి, ముఖ్యంగా చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే బ్రాండ్లు, వ్యాపారులపై నేరుగా ప్రభావం పడుతుంది. ప్రొటెక్టర్ గ్లాస్ మందం, పరిమాణం (Thickness and Dimension), నాణ్యత, దాని దృఢత్వంపై కఠినమైన ప్రమాణాలు ఉంటాయి. అంతేకాకుండా యాంటీ షాటర్ ఫిలిం, ఆయిల్ మరకలు పడకుండా ఉండే ఒలియోఫోబిక్ కోటింగ్, కళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండే యాంటీ గ్లేర్ ఫిలిం, బ్లూ-లైట్ ఫిల్టర్ వంటి క్వాలిటీ అంశాలను కచ్చితంగా టెస్ట్ చేశాకే BIS అనుమతి ఇస్తుంది.

దీనివల్ల సాధారణ ఫోన్ యూజర్లకు లాభంతో పాటు కాస్త భారం కూడా పడే అవకాశం ఉంది. మార్కెట్లో దొరికే స్క్రీన్ ప్రొటెక్టర్లు అన్నీ మంచి క్వాలిటీ, రక్షణ ప్రమాణాలతో దొరుకుతాయి కాబట్టి డిస్ప్లేకి పూర్తి రక్షణ లభిస్తుంది. కానీ, ఈ నాణ్యతా ప్రమాణాలు, ల్యాబ్ టెస్టింగ్‌లు దాటుకుని మార్కెట్లోకి రావాల్సి ఉండటం వల్ల రాబోయే రోజుల్లో స్క్రీన్ ప్రొటెక్టర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే వీటి లభ్యతలో కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఎన్నో స్థానిక బ్రాండ్లతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కంపెనీలు ఉన్నాయి, వీటన్నింటికీ ఈ కొత్త బిఐఎస్ నిబంధనలు పాటించడం తప్పనిసరి కానుంది.