Reading Time: < 1 minute
Ambika Warns Actress Radha Over Rs 46 Crore Cheque Dispute

Ambika Warns Radha Over Rs 46 Crore Cheque Dispute: ప్రముఖ సీనియర్ నటి రాధా కుటుంబంలో ఆస్తులు, వ్యాపారం, బంగారం వ్యవహారాలకు సంబంధించిన వివాదం పోలీసుల వరకు చేరిన విషయం తెలిసిందే. తన అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున్‌పై నటి రాధా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన గదిలో సంతకం చేసి ఉంచిన ఖాళీ చెక్కులను దొంగిలించి.. రూ.46 కోట్లను కాజేసేందుకు తన సోదరి, సోదరుడు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి ఇద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాధా తన ఫిర్యాదులో కోరారు.

అయితే రాధా చేసిన ఆరోపణలను ఆమె అక్క అంబిక ఖండించారు. తాను ఎలాంటి చెక్కులను దొంగిలించలేదని స్పష్టం చేశారు. ‘ఐదు చెక్కులను రాధానే నాకు ఇచ్చింది. కుటుంబ ఆస్తులు, వ్యాపారం, బంగారం తదితర అంశాలపై నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునే క్రమంలోనే రాధా ఆ చెక్కులను నాకు ఇచ్చింది. మధురవాయల్‌లోని 50 సెంట్ల స్థలం, ఏఆర్‌ఎస్ గార్డెన్స్‌లో వాటా, బంగారం వ్యవహారాలకు సంబంధించి మా మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ అంశాలపై గత జూలైలోనే నేను పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని అంబిక చెప్పారు.

‘కుటుంబంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు జరిగిన ఒప్పందంలో భాగంగానే రాధా నాకు ఐదు చెక్కులు ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే చెక్కుల విషయంలో నాపై రాధా తప్పుడు ఆరోపణలు చేస్తోంది. రూ.46 కోట్ల చెక్ వ్యవహారంపై నాపై వచ్చిన ఆరోపణలు నిజం కాదు. ఒకవేళ రాధా ఇచ్చిన చెక్కులు బ్యాంకులో తిరస్కరణకు గురైతే.. నేను కూడా రాధాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’ అని అంబిక హెచ్చరించారు. మరి అక్క వార్నింగ్‌పై రాధా ఎలా స్పందిస్తుందో చూడాలి.