Reading Time: 2 minutes
శ్రీ కృష్ణదేవ రాయలు కాలంలో నిర్మాణం.. మంగళగిరి లక్ష్మీ నరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..

ఏపీ రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎంతోమంది రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ది చేశారు. విజయనగర రాజు శ్రీ క్రిష్ణ దేవరాయలతో పాటు అమరావతి జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆలయంలో అనేక నిర్మాణాలు చేపట్టారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు దక్షిణ భారత దేశంలోనే అత్యంత ఎత్తైన తూర్పు గాలిగోపురాన్ని నిర్మించారు. రెండు వందల ఏళ్ల క్రితం ఈ గాలి గోపుర నిర్మాణం జరిగింది. అంతకంటే ముందే సుమారు ఐదు వందల ఏళ్ల క్రితం స్వామి వారి గర్భాలయం ముందు భాగంలో ముఖ మండపాన్ని శ్రీ క్రిష్ణ దేవరాయల కాలంలో నిర్మించారు. స్వామి వారి విగ్రహా మూర్తులకు అనేక కైంకర్యాలు ఈ ముఖ మండపంలోనే జరుగుతుంటాయి.

అయితే, ఈ రెండు చారిత్రక నిర్మాణాలు ప్రమాదంలో పడ్డాయి. గాలి గోపురంతో పాటు ముఖ మండపంలో కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే గాలి గోపురాన్ని పరిరక్షించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. గోపుం ముందు ఉన్న రోడ్డులోకి భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. ప్రధాన మార్గంలో ఉన్న రాతి కట్టడాల కింద పెద్ద పెద్ద ఇనుప గడ్డర్స్ ఏర్పాటు చేశారు. దీంతో గోపురానికి ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. ముఖమండపంలో పగుళ్లు రావడంతో ఇబ్బంది తలెత్తకుండా ఇక్కడ కూడా ఇనుప గడ్డర్స్ ఏర్పాటు చేశారు. అయితే పగుళ్లు కారణంగా వర్షాకాలంలో నీరు ముఖ మండపంలోకి వస్తుంది. దీంతో ఈ నిర్మాణాన్ని తొలగించి కొత్తగా ముఖమండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. చారిత్రక నేపథ్యంలో పురావస్తు శాఖ అధికారుల సాయం తీసుకొని యథావిథిగా దీనిని పునర్నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు.

ఈ క్రమంలో భాగంగా ముఖ మండపాన్ని తొలగిస్తున్నారు. ప్రతి రాతి స్తంభానికి ఒక నంబర్ ఇస్తారు. ఒక దాని తర్వాత మరొక స్తంభాన్ని తొలగించి భద్ర పరుస్తారు. వాటిని యథావిథిగా తిరిగి పునర్నిర్మాణంలో ఉపయోగిస్తారు. అయితే కొన్ని స్తంభాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు భావిస్తున్నారు. వాటి స్థానంలో ఎటువంటి వాటిని ఉపయోగించాలో అధికారులు తర్వాత నిర్ణయిస్తారు.

ముఖమండపం స్తంభాలను తొలగించే క్రమంలో తూర్పు, ఉత్తర ద్వారాలను మూసివేశారు. భక్తులను దక్షిణ ద్వారం నుండి ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ముఖ మండపం తొలగించడానికే నెలరోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం భారీ రాతి స్తంభాలను జాగ్రత్తగా తొలగిస్తున్నారు.

వీడియో చూడండి..