Reading Time: < 1 minute
Hyderabad Madhapur Oyo Room Woman Death Boyfriend Suspected Murder

Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్ 5లోని ‘హోటల్ OSLN టెర్మినస్’ ఓయో గదిలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఆమె ప్రియుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలిని విశాఖపట్నంకు చెందిన షారన్ నిఖిత టోప్నోగా పోలీసులు గుర్తించారు. ఆమె తన ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి నిన్న మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. అనంతరం OYO యాప్ ద్వారా సదరు హోటల్‌లోని రూమ్ నంబర్ 303లో ఇద్దరూ అద్దెకు దిగారు.

అయితే తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో కొండాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మహిళ మృతి చెందినట్లు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. షారన్ నిఖితను అత్యవసర చికిత్స నిమిత్తం ఆమె ప్రియుడు శ్రీనివాస రవి తేజ హోటల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రికి తీసుకువచ్చాడని, అయితే ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా, మృతురాలి ముఖం, తలపై తీవ్రమైన గాయాలు, వాపులు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో యువతి మృతి చెందినట్లు తెలియగానే ఆమె ప్రియుడు శ్రీనివాస రవి తేజ ఆసుపత్రి సిబ్బంది కంటపడకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు హోటల్ రూమ్ నంబర్ 303ను పరిశీలించగా, గదిలోని గోడలపై, బెడ్‌షీట్‌పై అనుమానాస్పద రక్తపు మరకలు కనిపించాయి. దీంతో వెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడు శ్రీనివాస రవి తేజ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.