Reading Time: 2 minutes

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. అక్టోబర్ 16న పోలింగ్

Caption of Image.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది. రెండు రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 11  రాజ్య స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఉత్తరప్రదేశ్‎లోని 10 స్థానాలు, ఉత్తరాఖండ్‎లోని ఒక స్థానానికి 2026, అక్టోబర్ 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ 11 మంది సభ్యుల పదవీకాలం 2026, నవంబర్‎లో ముగియనుంది.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 10 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం నవంబర్ 25న ముగియనుంది. ఇందులో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చెరో స్థానాన్ని కలిగి ఉన్నాయి. బీజేపీకి చెందిన దినేష్ శర్మ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అరుణ్ సింగ్, బన్వారీ లాల్ వర్మ, బ్రిజ్ లాల్, నీరజ్ శేఖర్, సీమా ద్వివేది, గీతా షాక్యలతో పాటు ఎస్పీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీకి చెందిన రామ్జీ గౌతమ్ పదవి విరమణ చేయనున్నారు. ఉత్తరాఖండ్‎కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నరేష్ బన్సల్ పదవి కాలం నవంబర్‎లో ముగియనుంది. ఈ స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. 

ఎవరు గెలిచే అవకాశం ఉందంటే..?

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ప్రస్తుత బలాబలాల ప్రకారం అక్టోబర్‎లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో అధికార బీజేపీ 8 సీట్లు గెలుచుకోవడం పక్కా. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి 2 సీట్లు దక్కే అవకాశం ఉంది. బీఎస్పీ తమకు ఉన్న ఏకైక స్థానాన్ని కూడా కోల్పోనుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. 1989 తర్వాత పార్లమెంటు ఉభయ సభలు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉభయ సభలతో సహా మొత్తం నాలుగు శాసన సభలలో బీఎస్పీకి ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి. ఇక, అసెంబ్లీలో శాసనసభలో పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉండటంతో ఉత్తరాఖండ్‌లో తన సీటును బీజేపీ సునాయాసంగా నిలబెట్టుకోనుంది. 

పూర్తి షెడ్యూల్ ఇదే

  • నోటిఫికేషన్ జారీ: సెప్టెంబర్ 29, 2026 (మంగళవారం)
  • నామినేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 6, 2026 (మంగళవారం)
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 7, 2026 (బుధవారం)
  • అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ: అక్టోబర్ 9, 2026 (శుక్రవారం)
  • పోలింగ్ తేదీ: అక్టోబర్ 16, 2026 (శుక్రవారం) ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు
  • ఓట్ల లెక్కింపు: అక్టోబర్ 16, 2026, సాయంత్రం 5:00 గంటలకు

 

©️ VIL Media Pvt Ltd.