Reading Time: 2 minutes
10వ తరగతి, ఐటీఐ, ఇంటర్‌ అర్హతతో 213 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (SLPRB AP) పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో స్టిపెండరీ కానిస్టేబుల్‌ (మెకానిక్స్‌, డ్రైవర్స్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హత కలిగిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 213 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో స్టిపెండరీ కానిస్టేబుల్‌ (మెకానిక్స్‌) – పురుషులు పోస్టులు 15, స్టిపెండరీ కానిస్టేబుల్‌ (డ్రైవర్స్‌) – పురుషులు పోస్టులు 198 వరకు ఉన్నాయి. పోస్టును బట్టి అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. వైర్‌మెన్‌, మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌, మెకానిక్‌ డీజిల్‌, ఫిట్టర్‌, ఆటో ఎలక్ట్రీషియన్‌, మోటార్‌ సంబంధిత ట్రేడ్‌లలో అర్హతతో పాటు నిర్దేశిత ఉద్యోగ అనుభవం ఉండాలి. డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత డ్రైవింగ్‌ అర్హతలు, లైసెన్స్‌, అనుభవానికి సంబంధించిన నిబంధనలను పూర్తి నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. అర్హత కలిగిన అభ్యర్థులు SLPRB AP అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరి తేదీ, ఫీజు, వయోపరిమితి, పరీక్ష తేదీలు తదితర వివరాలను బోర్డు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనుంది.

ఎంపిక ప్రక్రియ ఇలా..

అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. ప్రధానంగా కింది పరీక్షలు, పరిశీలనలు ఉంటాయి. సర్టిఫికెట్ల పరిశీలన, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (PMT), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (PET), 1600 మీటర్ల పరుగు, ట్రేడ్‌ టెస్ట్‌ / డ్రైవింగ్‌ టెస్ట్‌, రాత పరీక్ష – టెక్నికల్‌ పేపర్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ప్రతి దశలో నిర్దేశించిన అర్హత ప్రమాణాలను సాధించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి ట్రేడ్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌లో సంబంధిత నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు పే స్కేల్‌ ఉంటుంది. జీతం, ఇతర అలవెన్సులు, సేవా నిబంధనలు తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అమలు చేస్తారు.

ముఖ్యమైన వివరాలు..

  • పోస్టుల సంఖ్య: 213
  • మెకానిక్‌ పోస్టులు: 15
  • డ్రైవర్‌ పోస్టులు: 198
  • అభ్యర్థులు: పురుషులు
  • జీతం: రూ.25,220 – రూ.80,910
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
  • దరఖాస్తు తేదీలు: త్వరలో ప్రకటన