Reading Time: < 1 minute

బ్రేకప్ చెప్పిందని పట్టపగలే ప్రియురాలిని కాల్చి చంపిన యువకుడు.. ఆ తర్వాత తాను సూసైడ్

Caption of Image.

లక్నో: బ్రేకప్ చెప్పిందని ప్రియురాలిని ఆమె పని చేస్తోన్న స్కూల్‎లోనే పిల్లల ముందే కాల్చి చంపాడు ప్రియుడు. ఆ తర్వాత తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‎లోని లఖింపూర్ ఖేరీలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిషాత్ ఫాతిమా అనే 26 ఏళ్ల యువతి లఖింపూర్ ఖేరీలోని చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్‌లో టీచర్‎గా పని చేస్తోంది. మహమ్మద్ సౌద్ అనే యువకుడితో ఫాతిమా ప్రేమాయాణం నడిపింది. 

మనస్పర్ధాలు రావడంతో ఇటీవల మహమ్మద్‎కు బ్రేకప్ చెప్పింది ఫాతిమా. ప్రియురాలు వదిలేయడాన్ని తట్టుకోలేకపోయిన మహమ్మద్ ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం (సెప్టెంబర్ 21) ఫాతిమా పని చేస్తోన్న పాఠశాలకు వెళ్లాడు. అక్కడ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. 

ఇరువురి మధ్య ఘర్షణ ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహమ్మద్ వెంట తీసుకెళ్లిన తుపాకీతో స్కూల్‎లో పిల్లల ముందే ప్రియురాలిని తలపై కాల్చాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పాఠశాల సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్‎మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ షాకింగ్ ఘటనతో విద్యార్థులతో పాటు స్కూల్ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

©️ VIL Media Pvt Ltd.