Reading Time: < 1 minute
ఆస్కార్‌ 2027కు భారత్ అధికారిక ఎంట్రీ: మరాఠీ చిత్రం గోంధల్

భారతదేశం తరపున 2027 ఆస్కార్‌ అవార్డుల కోసం మరాఠీ థ్రిల్లర్ చిత్రం గోంధల్ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. 99వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఈ చిత్రం పోటీపడనుంది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వివిధ భాషల నుంచి వచ్చిన 33 చిత్రాలను పరిశీలించిన అనంతరం గోంధల్ను ఎంపిక చేసింది. దర్శకుడు సంతోష్ దవఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం, మహారాష్ట్రలోని సంప్రదాయ గోంధల్ ఆచారాల నేపథ్యంలో రూపొందింది. ఒకే రాత్రిలో జరిగే కథతో, మహిళకు ఇష్టంలేని పెళ్లి, ఆ తర్వాత ఆమె ప్రేమ, హత్య మిస్టరీ, సర్వైవల్ గేమ్ వంటి థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సంతోష్ దవఖర్ ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ పీకాక్ అవార్డును గెలుచుకున్నారు. గ్రామీణ సంస్కృతి, భావోద్వేగాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన గోంధల్ ఆస్కార్ రేసులో నిలుస్తుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఇది శ్వాస్, హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ, కోర్ట్ తర్వాత ఆస్కార్‌కు వెళుతున్న నాల్గవ మరాఠీ చిత్రం.