Reading Time: 2 minutes
India Vs Japan Team India Captain Shreyas Iyer Praises Axar Patel After Thriller

Shreyas Iyer Reaction on India Win vs Japan: జపాన్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత్ తృటిలో ఓటమి నుంచి గట్టెక్కింది. వర్షం, వెట్ అవుట్‌ఫీల్డ్ కారణంగా మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. అనంతరం జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లకు 30 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో 16 పరుగులతో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పాడు. స్పిన్నర్ల బంతులు ఎంత వేగంతో వస్తున్నాయో అంచనా వేయడం సవాలుగా మారిందన్నాడు. సాధారణంగా నిలకడగా పరుగులు చేసే భారత ఓపెనర్లు కూడా ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డారని పేర్కొన్నాడు. లక్ష్య ఛేదన చివరలో తాము ఓడిపోతాం అనుకున్నా అని, అక్షర్ పటేల్ అద్భుతంగా బంతులు వేసి టీమిండియాకు విజయాన్ని అందించాడని ప్రశంసించాడు. తాను క్రీజులోకి వచ్చిన తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని వీలైనంత ఎక్కువగా సింగిల్స్, డబుల్స్ తీసుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తనతో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లతో కూడా పరిస్థితుల గురించి చర్చించానని శ్రేయస్ చెప్పాడు.

‘బంతి ఎలా వస్తుందో గమనిస్తూ దాని తగ్గట్టుగా ఆడాలని నిర్ణయించుకున్నాను. బంతి తిరుగుతూ, పిచ్‌పై ఆగి వస్తే దాని వేగాన్ని ఉపయోగించుకోవాలి. క్రీజులో నిలబడి సింగిల్స్, డబుల్స్ తీసుకోవడంపై దృష్టి పెట్టాను. అది బాగా పనిచేసింది’ అని శ్రేయస్ పేర్కొన్నాడు. జపాన్ జట్టు ప్రదర్శనను కూడా శ్రేయస్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఐదు ఓవర్ల మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చని, ప్రత్యర్థి జట్టు కూడా పోటీ ఇవ్వగలదని చెప్పాడు. ‘ఐదు ఓవర్ల మ్యాచ్ ఎటు వెళ్తుందో చెప్పలేం. మీరు ఎంత మంచి జట్టైనా ప్రత్యర్థులు కూడా పోటీగా ఉంటారు. ఈరోజు జపాన్ జట్టు చూపించిన వైఖరి అద్భుతంగా ఉంది. వారి ఆటతీరు, విధానం ప్రశంసనీయం. వారు సరైన దారిలో ఉన్నారని అనుకుంటున్నాను’ అని శ్రేయస్ అన్నాడు.

జపాన్ జట్టుకు ఆఫ్ఘనిస్థాన్, నేపాల్‌తో మరికొన్ని మ్యాచ్‌లు ఉన్నాయని, వాటి ద్వారా ఆ జట్టు మరింత అనుభవం సంపాదిస్తుందని శ్రేయస్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు. ఆసియా క్రీడల నేపథ్యంలో జపాన్‌తో మ్యాచ్ భారత్‌కు కూడా ఎంతో ఉపయోగపడిందని శ్రేయస్ తెలిపాడు. ముఖ్యంగా పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మ్యాచ్ మంచి ప్రాక్టీస్‌గా మారిందన్నాడు. కఠినమైన బ్యాటింగ్ పరిస్థితుల్లో ఎలా ఆడాలో తెలుసుకోవడంతో పాటు స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ మ్యాచ్ తమకు మంచి అవకాశాన్ని ఇచ్చిందని సర్పంచ్ సాబ్ పేర్కొన్నాడు. చివరికి రెండు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించినప్పటికీ, జపాన్ జట్టు పోరాటం మాత్రం అందరిని ఆకట్టుకుంది.