Reading Time: 2 minutes
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్.. కొత్త ఇళ్ల మంజూరు అప్పుడే..

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించిన అనంతరం లాటరీ విధానంలో లబ్దిదారులను ఎంపిక చేశారు. ఇందులో ఎంపికైన లబ్దిదారులకు సంబంధించి తుది పరిశీలన చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు బుధవారం నుంచి లబ్దిదారుల ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. నగరంలోని మొత్తం 16 నియోజకవర్గాల్లో లాటరీలో ఎంపికైన లబ్దిదారుల ఇంటికి వెళ్లి పరిశీలన చేయనున్నారు. గత 10 ఏళ్లుగా అదే నియోజకవర్గ పరిధిలో ఉంటున్నారా.. అన్ని అర్హతలు ఉన్నాయా.. అనే వివరాలను తనిఖీ చేయనున్నారు. ఈ పరిశీలన కోసం హౌసింగ్ బోర్డు అధికారులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు.

నాలుగు రోజుల్లో పరిశీలన పూర్తి

నాలుగు రోజుల్లో లబ్దిదారుల పరిశీలన ప్రక్రియ ముగియనుందని తెలుస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో రోజుకు 150 లబ్దిదారుల ఇంటికి వెళ్లి పరిశీలన చేపడతారు. ఇందుకోసం అధికారులకు ప్రత్యేక శిక్షణ కూడా అందించారు. ప్రస్తుతానికి నియోజకవర్గానికి 480 మందికి ఇళ్లను మంజూరు చేయనున్నారు. దీంతో అంతే మొత్తంలో లబ్దిదారులను ఎంపిక చేశారు. పరిశీలన తర్వాత వీరిలో ఎవరినైనా తొలగిస్తే.. వెయిటింగ్ జాబితాలో ఉన్న 120 మందిలో కొంతమందికి అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్‌ను అధికారులు సిద్దం చేశారు. అధికారికంగా ఈ లిస్ట్‌ను కూడా విడుదల చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో వెయిటింగ్ లిస్ట్ 300 వరకు దాటింది. పరిశీలన ప్రక్రియలో అనర్హులుగా తేలిన వారిని తొలగించి వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి ఇల్లు మంజూరు చేస్తారు. నాలుగు రోజుల తర్వాత తుది లబ్దిదారుల జాబితా సిద్దం చేయనున్నాయి. అయతే లాటరీలో ఎంపికైన లబ్దిదారుల వివరాలను https://tghb.telangana.gov.in/allotmentobjection పోర్టల్‌లో హౌసింగ్ బోర్డు అందుబాటులో ఉంచింది. పేరు, దరఖాస్తు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా చూసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడే తెలియజేయవచ్చు.

తనిఖీ చేసే అంశాలివే..

దరఖాస్తులో పేర్కొన్న వివరాలు అన్నీ నిజమా.. కదా అనేది చెక్ చేస్తారు. గత పదేళ్లుగా అదే నియోజకవర్గ పరిధిలో ఉంటున్నారా.. లేదా అనేది తనిఖీ చేస్తారు. స్థానికంగా ఉంటున్నారా… లేదా అనేది నిర్ధారించుకుంటారు. అలాగే కుటుంబసభ్యుల వివరాలను కూడా పరిశీలిస్తారు. అనంతరం వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. అక్కడే ఇంటిని జియో ట్యాగ్ చేస్తారు. ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక బృందాలు లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి తుది పరిశీలన నేటి నుంచి చేపట్టనున్నారు. కాగా  ఆగస్ట్ 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో లాటరీలు నిర్వహించిన విషయం తెలిసిందే.