Reading Time: < 1 minute
Vijay Withdraws Cases Against Farmers And Teachers Takes Swipe At Dmk

Tamil Nadu: తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు, ఉపాధ్యాయులపై ఉన్న కేసుల్ని ఎత్తేశారు. జీవనోపాధి, హక్కులు, న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా చేపట్టిన ఆందోళనలకు సంబంధించి 2021 మే నుంచి 2026 ఏప్రిల్ మధ్య నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. మానవతా దృక్పథంతో పాటు ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

గత ప్రభుత్వం రైతులు, టీచర్లపై అనేక కేసులు నమోదు చేసిందని విజయ్ విమర్శించారు. వారి ప్రజాస్వామ్య హక్కులు హరించబడ్డాయని, కేసుల కారణంగా ఇప్పటికే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు, టీచర్ల న్యాయమైన డిమాండ్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తిరువణ్ణామలై జిల్లాలో పారిశ్రామిక ఎస్టేట్‌కు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ఆందోళనల్ని విజయ్ ప్రశ్నించారు. ఈ నిరసనల్లో కొందరు రైతులపై గుండాస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారని చెప్పారు.

పరందూర్‌లో ప్రతిపాదిత విమానాశ్రయానికి వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళనల కేసులను కూడా ఉపసంహరిస్తామని విజయ్ ప్రకటించారు. విమానాశ్రయం కారణంగా వ్యవసాయ భూములు, నీటి వనరులు, జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కేసుల ఉపసంహరణ ప్రజాస్వామ్య హక్కులపై మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలుకు, ప్రభుత్వానికి మధ్య నమ్మకాన్ని పెంచుతుందని విజయ్ అన్నారు.

అయితే, విజయ్ చర్యపై డీఎంకే స్పందించింది. రైతులపై కేసులు విత్ డ్రా చేసుకోవడం ఇదే తొలిసారి కాదని, తమ డీఎంకే ప్రభుత్వ హాయంలో నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన 5000కు పైగా కేసుల్ని ఉపసంహరించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. CAA, మూడు వ్యవసాయ చట్టాలు, కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను తమ ప్రభుత్వం ఉపసంహరించిందని స్టాలిన్ పేర్కొన్నారు.