Reading Time: < 1 minute

అయోధ్య రామ మందిరానికి ముగ్గురు కొత్త ట్రస్టీలు… సీఈవో ప్రకటనపై ఉత్కంఠ..!

Caption of Image.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రామ మందిర పరిపాలన పునర్వ్యవస్తీకరణలో భాగంగా బుధవారం ( సెప్టెంబర్ 2 ) ముగ్గురు కొత్త ట్రస్టీలను నియమించింది. కొత్త ట్రస్టీలుగా ఢిల్లీకి చెందిన మహేష్ భగచంద్కా, అయోధ్య నివాసి మదన్ మోహన్ పాండే, షికోహాబాద్‌కు చెందిన నిర్మలా యాదవ్ నియమితులయ్యారు. మహేష్ భగచంద్కా దివంగత విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్‌కు బంధువు అని సమాచారం.

అయోధ్యలోని ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ నివాసమైన మణి రామ్ దాస్ ఛావనిలో ఈ సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు ఇతర నియామకాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

త్వరలోనే సీఈఓ ప్రకటన

ఈ సమావేశంలోనే సీఈఓ పేరు ప్రకటనపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. సీఈఓ ట్రస్ట్ పరిపాలనా కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు, రామ మందిర సముదాయానికి సంబంధించిన కీలక కార్యనిర్వహణ బాధ్యతలను కూడా నిర్వహిస్తారు. సీఈఓ అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

సీఈఓ పదవికి పోటీపడే అవకాశం ఉన్నవారిపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి, ఈ క్రమంలో మాజీ ఐపీఎస్ అధికారి రాజేష్ పాండే, మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ చంద్ర పేర్లుగా ప్రధానంగా వినిపిస్తున్నాయి.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి యోగేశ్వర్ రామ్ మిశ్రా పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ, ఆయన ఇంటర్వ్యూకు హాజరు కాలేదని తెలుస్తోంది. సీఈఓను ఎంపిక చేసేందుకు జూలై 6న ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, సురేష్ హవారే ఉన్నారు.

సీఈఓ పదవికి 5వేల 585 మంది దరఖాస్తు చేసుకోగా, 3వేల 570 మంది అభ్యర్థులు తమ దరఖాస్తు పత్రాలను పూర్తి చేసి తిరిగి ఇచ్చారు. అయితే, షార్ట్‌లిస్ట్ చేసిన ముగ్గురు అభ్యర్థుల తుది జాబితాను ట్రస్ట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

©️ VIL Media Pvt Ltd.