Reading Time: < 1 minute
NEET UG 2026 Exam Rules: నీట్‌ యూజీ పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!

హైదరాబాద్‌, ఏప్రిల్ 25: నీట్‌ యూజీ పరీక్షను దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఒకే షిఫ్టులో ఆఫ్‌లైన్ (పెన్, పేపర్‌ విధానం)లో మే 3న నిర్వహించనున్నారు. ఇప్పటికే నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను కూడా జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) విడుదల చేసింది. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించిన పలు మార్గదర్శకాలను ఎన్ఎంసీ విడుదల చేసింది.

నీట్‌ యూజీ పరీక్ష రూల్స్‌ ఇవే..

పరీక్షను పకడ్భందీగా నిర్వహించాలని అన్ని వైద్య కళాశాలలు, వైద్య విద్యా సంస్థలను ఆదేశించింది. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈ దిశగా వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొంటూ తాజాగా పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తప్ప మే 2, 3 తేదీల్లో వైద్య విద్యార్థులకు సెలవులు ఇవ్వొద్దని ఎన్‌ఎంసీ ఆదేశించింది. మే 3 (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్‌ పరీక్ష జరగనుంది. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో 3 గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. ఈ సారి దాదాపు 24 లక్షల మంది పోటీ పడుతున్నారు.

పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందుగా చేరుకోవాలి. అడ్మిట్ కార్డుతో పాటు ఒక ఒరిజినల్ ఫోటో ఐడీ ప్రూఫ్ తీసుకురావాలి. బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్‌తోనే ఓఎంఆర్ షీట్ నింపాలి. కరెక్షన్ ఫ్లూయిడ్, ఓవర్రైటింగ్ నిషేధం. పొడవు చేతులున్న దుస్తులు, భారీ బట్టలు ధరించి పరీక్షకు రాకూడదు. అలాగు మెటల్ నగలు, గడియారం, ఎలక్ట్రిక్‌ వస్తువులకు అనుమతి లేదు. సంప్రదాయ దుస్తులు ధరించే వారు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకుని అధికారులకు తెలియజేయాలి.

నీట్‌ యూజీ 2026 పరీక్ష విధానం..

నీట్‌ పరీక్ష మొత్తం 720 మార్కులకు గాను మొత్తం 180 ప్రశ్నలకు ఉంటుంది. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నలు, జువాలజీ, బయాలజీ నుంచి 90 ప్రశ్నలు చొప్పున వస్తాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.