
Kavitha New Party: తెలంగాణ రాజకీయాల్లో నేడు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. గత కొంతకాలంగా ఊరిస్తున్న ఆమె కొత్త పార్టీ ప్రకటన నేడు (ఏప్రిల్ 25, శనివారం) అట్టహాసంగా జరగనుంది. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని మునీరాబాద్ వద్ద గల అద్వయ కన్వెన్షన్‌లో ఈ పార్టీ ప్రకటన సభ జరగనుంది. ఈ సభా ప్రాంగణానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును పెట్టడం గమనార్హం. పార్టీ జెండా ఆవిష్కరణ, పేరు ప్రకటన కోసం వేలాదిగా తరలివస్తున్న కార్యకర్తలతో మేడ్చల్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
కవిత షెడ్యూల్ ఇదే..
ఉదయం కవిత గన్ పార్క్‌కు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం గన్ పార్క్ నుంచి భారీ కాన్వాయ్‌తో అద్వయ కన్వెన్షన్‌కు బయలుదేరుతారు. ఉదయం 10 గంటలకు పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి, పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ ప్రకటన అనంతరం కవిత సుమారు గంటన్నర పాటు సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు.
ఉత్కంఠ రేపుతున్న పార్టీ పేరు – ఎజెండా..
కవిత పెట్టబోయే పార్టీ పేరు ‘తెలంగాణ జాగృతి పార్టీ’గా ఉంటుందా లేక ‘సర్వోదయ తెలంగాణ’ అనే నినాదంతో మరేదైనా పేరు పెడతారా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఆమె ప్రసంగంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ, ప్రత్యర్థి పార్టీలపై ఎలాంటి విమర్శలు చేస్తారనే దానిపై అందరి దృష్టి నెలకొంది. తెలంగాణలో ఒక మహిళా నాయకురాలు స్థాపించబోతున్న తొలి ప్రధాన ప్రాంతీయ పార్టీగా ఇది గుర్తింపు పొందనుంది. ఈ సభ కోసం సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా, ట్రాఫిక్ అడ్వైజరీని కూడా జారీ చేశారు.