Reading Time: 2 minutes
పంతాలు వీడి.. ప్రజల కోసం ఒక్కటయ్యి! కీలక నిర్ణయాలు, అంగీకారాలు.. రోడ్డెక్కిన బస్సులు!

తెలంగాణ ప్రజలకు, ఆర్టీసీ ప్రయాణికులకు ఇది నిజంగా పెద్ద ఊరటనిచ్చే వార్త. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మిక సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం మరియు కార్మిక సంఘాల జేఏసీ (JAC) మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో, శనివారం (ఏప్రిల్ 25) తెల్లవారుజాము నుంచే బస్సులు రోడ్డెక్కాయి.

శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ చర్చలు దాదాపు 12 గంటల పాటు అర్థరాత్రి వరకు కొనసాగాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు ప్రభుత్వ పక్షాన చర్చల్లో పాల్గొనగా, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న నేతృత్వంలోని కార్మిక నేతలు తమ డిమాండ్లను వినిపించారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా కార్మికులు సంయమనం పాటించారని, అందుకే సమస్య పరిష్కారం సులభమైందని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.

ఈ చర్చల్లో కార్మికుల చిరకాల కోరికలపై ప్రభుత్వం కొన్ని కీలక హామీలను ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ విలీన ప్రక్రియను పర్యవేక్షించడానికి అధికారులతో పాటు ఆర్టీసీ కార్మిక నేతలతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 2021 పే-స్కేల్ అమలుపై కూడా సానుకూలత వ్యక్తమైంది. ఇక ఆర్టీసీలో ప్రజాస్వామ్య బద్ధంగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్షణమే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది.

సమ్మె విరమణ ప్రకటన వెలువడగానే ఆర్టీసీ వీసీ , ఎండీ వై. నాగిరెడ్డి రంగంలోకి దిగారు. శనివారం తెల్లవారుజామున మొదటి షిఫ్ట్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా వంద శాతం బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. “ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి సంస్థ చింతిస్తోంది. ఇకపై ప్రయాణికులు తమ ప్రయాణాలను సురక్షితంగా ప్లాన్ చేసుకోవచ్చు” అని ఆయన తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించిన ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. సంస్థ బలోపేతానికి, లాభాల బాటలో నడిపించడానికి తామంతా నిరంతరం కృషి చేస్తామని కార్మిక నేత ఈదురు వెంకన్న ప్రకటించారు. మొత్తానికి, ప్రభుత్వం, కార్మికుల మధ్య ఉన్న గ్యాప్ తొలగడంతో ‘తెలంగాణ ప్రగతి రథచక్రాలు’ మళ్లీ వేగంగా కదలడం ప్రారంభించాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..