
Tirumala Adulterated Ghee Case: సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై నియమించిన ఏక సభ్య కమిషన్ క్షేత్రస్థాయి విచారణ ముగిసింది. దినేశ్ కుమార్ కమిషన్ టీటీడీ అధికారుల నుంచి కీలక దస్త్రాలు, టెండర్ నిబంధనల డేటా సేకరించింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిబంధనల సడలింపుపై ఆరా తీసిన కమిషన్, ఈ నెల 30న సీఎస్ కు రిపోర్ట్ ఇచ్చేందుకు అమరావతికి బయలుదేరింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ నేతృత్వంలోని ఈ కమిషన్, గత రెండు రోజులుగా తిరుపతి, తిరుమలలో పర్యటించి కీలక ఆధారాలను సేకరించింది. తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న కమిషన్, విచారణ ముగించుకుని అమరావతికి బయలుదేరింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు ప్రక్రియలో జరిగిన అక్రమాలపై కమిషన్ లోతుగా ఆరా తీసింది. అప్పట్లో టెండర్ నిబంధనలను ఎందుకు, ఎలా సడలించారనే అంశంపై టీటీడీ ఉన్నతాధికారులను ప్రశ్నించింది. టీటీడీ ముఖ్య ఆర్థిక గణాంక సలహాదారు బాలాజీ నుంచి గత పాలకమండలి నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలను సేకరించింది. అలాగే మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్ విభాగాల అధికారులతో పాటు ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యుడు విజయభాస్కర్ రెడ్డి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న ఈ ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి 45 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉండగా.. వరుస సెలవులు రావడం, కొందరు అధికారులు విచారణకు సకాలంలో హాజరుకాకపోవడంతో గడువు పొడిగించారు. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్ తన తుది నివేదికను సమర్పించనుంది. నెయ్యి నాణ్యత పరీక్షల్లో వైఫల్యాలు, టెండర్ల ఖరారులో జరిగిన లోపాలను ఈ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.