
AAP Crisis: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో పెను రాజకీయ సంక్షోభం నెలకున్న విషయం తెలిసిందే. పార్టీ కీలక నేతలు, రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ శుక్రవారం అధికారికంగా బీజేపీలో చేరారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్‌కు ఇది కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజా పరిణామంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. పార్టీని వీడటం కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదని, ఇది పంజాబ్ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడమేనని ఆయన మండిపడ్డారు. దీనిని “పంజాబ్ ప్రజలకు చేసిన ద్రోహం”గా ఆయన అభివర్ణించారు.
తప్పు కేజ్రీవాల్‌దే .. అన్నా హజారే ధ్వజం
ఈ రాజకీయ పరిణామాలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందిస్తూ ఆప్ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంది. ఆప్ సరైన మార్గంలో నడిచి ఉంటే ఈ నేతలు పార్టీని వీడేవారు కాదు. పార్టీని నడుపుతున్న వారిలోనే తప్పు ఉంది” అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం (అరవింద్ కేజ్రీవాల్) సరైన దిశలో వెళ్లకపోవడం వల్లే సంబంధాలు దెబ్బతిన్నాయని ఆయన పదేపదే పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాము అనేక సమస్యలను ఎదుర్కొన్నామని, అందుకే తప్పుకుంటున్నామని ప్రకటించారు. ఆప్ రాజ్యసభ ఎంపీలలో దాదాపు మూడింట రెండు వంతుల మంది పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొనడం సంచలనం రేపింది. ప్రస్తుతం ముగ్గురు ఎంపీలే బీజేపీలో చేరినప్పటికీ, మరికొందరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆప్‌కు పెద్ద దెబ్బ..
2012లో ఏర్పాటైన ఆప్, కేవలం 14 ఏళ్లలో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకుని జాతీయ పార్టీగా ఎదిగింది. రాజ్యసభలో పార్టీకున్న 10 మంది ఎంపీలలో ఏడుగురు పార్టీని వీడతారనే ప్రచారం ఆప్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీ పుట్టుకకు స్ఫూర్తినిచ్చిన అన్నా హజారే స్వయంగా కేజ్రీవాల్ నాయకత్వాన్ని తప్పుబట్టడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో అధికారంలో ఉన్న పార్టీకి ఈ పరిణామాలు భవిష్యత్తులో పార్టీకి గడ్డుకాలాన్ని సూచిస్తున్నాయని చెబుతున్నారు.