Reading Time: 2 minutes
Iran Us Talks Islamabad High Stakes Negotiations

ఇస్లామాబాద్ వేదికగా మరొకసారి శనివారం అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి. అయితే ఈ చర్చలు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ లేకుండానే చర్చలు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి ఇరాన్ నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఆధ్వర్యంలో బృందం పాకిస్థాన్‌కు చేరుకుంది.

2

ఇక అమెరికా నుంచి మధ్యప్రాచ్యంలోని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ మాత్రమే ఇస్లామాబాద్ వెళ్తున్నట్లుగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవట్ పేర్కొన్నారు. చర్చల కోసం ఇరానీయులు సంప్రదించారని.. ముఖాముఖి సంభాషణ కోసం అడిగారని తెలిపారు. చర్చల విషయాలను అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు తమ బృందం వివరిస్తారని చెప్పారు.

3

ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు తొలి దశ చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి. రెండో దఫా చర్చలు గత బుధవారం జరగొచ్చని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. అనూహ్యంగా శనివారం మరోసారి చర్చలకు శ్రీకారం చుట్టారు. ఈ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారైనా చర్చలు ఫలిస్తాయా? లేదా? అన్నదానిపై ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

ఇక ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతుండగా పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇస్లామాబాద్ నగరాన్ని పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరంలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ నిరాకరణ
ఇదిలా ఉంటే పాకిస్థాన్ పర్యటనపై ఇరాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అరఘ్చీ ఇస్లామాబాద్‌లో ట్రంప్ ప్రభుత్వంతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరపబోరని పేర్కొంది. కేవలం యుద్ధాన్ని ముగించడానికి సంబంధించిన ఇరాన్ అభిప్రాయాలను, సూత్రాలను మధ్యవర్తి అయిన పాకిస్థాన్‌ పక్షానికి అందజేస్తారని తెలిపింది.

1