Reading Time: < 1 minute

ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం.. రోడ్డెక్కనున్న బస్సులు

Caption of Image.

ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు ఫలించాయి. దాదాపు 7 గంటలుగా కొనసాగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్లకు సానుకూలంగా స్పందించారు మంత్రులు. 2026 ఏప్రిల్ 24న సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన చర్చలు కొలిక్కి రావడంతో ఏప్రిల్ 25న ఫస్ట్ షిఫ్టు నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయి. 

ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. జేఏసీ నేతల డిమాండ్లకు మంత్రులు సానుకూలంగా స్పందించారు. మొత్తం 32 డిమాండ్లలో ముందు నుంచీ 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ వచ్చింది. 
మూడు కీలక డిమాండ్లపైనే సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. 

ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పీఆర్సీ అంశాలపైనే సుదీర్ఘ చర్చలు జరిగాయి. పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని జేఏసీ నేతలు పట్టు బట్టారు. ఆర్థిక అంశాలతో కూడుకున్నది అయినందున సమయం కావాలని మంత్రులు కోరారు. విడతల వారీగా బకాయిలు చెల్లించనున్నట్లు మంత్రులు ప్రతిపాదించారు. ఇక ఆర్టీసీ విలీనం అంశంపై కమిటీ వేసేందుకు మంత్రుల బృందం ప్రతిపాదించింది. ఈ అంశాలపై దాదాపు మూడు దశలుగా చర్చలు జరిగాయి. 

జేఏసీ నేతల కీలక డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కార్మికులకు ఇచ్చే బెనిఫిట్స్ దశలవారిగా ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఎలకట్రిక్ బస్సుల దృష్ట్యా గ్రేటర్ లో ఉద్యోగుల బదిలీ చేపట్టబోమని హామీ ఇచ్చారు మంత్రులు. కారుణ్య నియామకాలను పర్మినెంట్ చేసేందుకు ఓకే చెప్పారు. ప్రభుత్వంలో విలీనానికి ఓకే చెప్పారు. అయితే విలీనం చేస్తే గుర్తింపు ఎన్నికలు, పీఆర్సీ అంశాలు ఉండవని చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.