Reading Time: < 1 minute
Ipl 2026 Rcb Vs Gt Virat Kohli 81 Match Report Points Table

RCB vs GT: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ చిత్తు చేసింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఆర్‌సీబీ ఛేదించడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుత శతకంతో కదం తొక్కాడు. అయితే అతని సెంచరీ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయింది.

అదరగొట్టిన కోహ్లీ, పడిక్కల్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (81), దేవదత్ పడిక్కల్ (55) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరూ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడి రన్ రేట్‌ను తగ్గకుండా చూశారు. కీలక సమయంలో బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తమ ఓటమిపై విశ్లేషించారు. ఓటమికి ప్రధాన కారణాలను ఆయన స్వయంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో వైఫల్యం మమ్మల్ని విజయానికి దూరం చేసింది. 16వ ఓవర్ నుంచి 19వ ఓవర్ మధ్య తమ జట్టు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోవడం మ్యాచ్‌ను మలుపు తిప్పిందని గిల్ అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ సున్నా పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడం తమ కొంపముంచిందని, దానికి భారీ మూల్యం చెల్లించుకున్నామని గిల్ అంగీకరించారు. పవర్‌ప్లే తర్వాత వికెట్లు తీయడంలో బౌలర్లు విఫలమయ్యారని, సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయామని పేర్కొన్నారు. సెంచరీ చేసిన సాయి సుదర్శన్‌ను గిల్ మెచ్చుకున్నారు. గత కొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులకే అవుట్ అయినప్పటికీ, ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడని ప్రశంసించారు. “తర్వాతి మ్యాచ్‌లో సాయికి పవర్‌ప్లేలో ఎక్కువ స్ట్రైక్ ఇస్తాను” అంటూ గిల్ సరదాగా వ్యాఖ్యానించారు.